Ganesh Nimajjanam: కొనసాగుతోన్న నిమజ్జనం..
ట్యాంక్ బాండ్ వద్ద నిమజ్జనాలు కొనసాగుతోన్నాయి. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్క్ లో ఇంకా నిమజ్జనాలు చేస్తున్నారు. చాలా గణనాథులను నిమజ్జనం చేయడానికి వాహనాలు బారులు తీరాయి. నెక్లెస్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచి ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉంది తెలుస్తోంది. నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతోన్నాయని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతోన్నాయి. సెక్రెటేరియట్, ఎన్టీఆర్ మార్క్ లో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే పోలీసులు ఆ మార్గాన వచ్చే వినాయక విగ్రహాల వాహనాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లీస్తున్నారు. సుమారు 5 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం అనుకున్న సమయంలోనే జరిగింది.

మంగళవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన బడా గణనాథుడి శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు ముగిసింది. ఆ తర్వాత పూజలు నిర్వహించి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. బాలాపూర్ గణేషుడి నిమజ్జనం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జరిగింది. బుధవారం ఉదయం వరకు లక్షకు పైగా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు ప్రకటించారు. నెక్లెస్ రోడ్డు 2 వేలకు పైగా, ఎన్టీఆర్ మార్క్ లో 4, 700, మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546 విగ్రహాలను నిమజ్జనం చేశారు.
నిమజ్జనం రోజు భక్తులు భారీగా ట్యాంక్ బండ్ మీదికి తరలొచ్చారు. అలాగే చాలా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు వాటర్ బాటిల్లు, చెత్తతో నిండిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. చాలా మంది ఇష్టానుసారంగా చెత్తను పడేశారు. కాగా నిమజ్జనం రోజు మెట్రో రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు భారీగా ప్రయాణికులు వచ్చారు.












Click it and Unblock the Notifications