సీఎంగా కేసీఆర్‌కు ఇదే చివరి పుట్టినరోజా? కేటీఆర్ పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు ఇదే చివరి పుట్టినరోజా.. మంత్రి,తనయుడు కేటీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా... జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండు అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నెల 7న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతుండటం... ఇదే నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అధి శ్రావణ యాగాన్ని నిర్వహిస్తుండటం ఇందుకు సంకేతాలా అన్న చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా కేటీఆర్‌ సీఎం కాబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆ విషయాన్ని ప్రకటించేందుకే సమావేశమా..?

ఆ విషయాన్ని ప్రకటించేందుకే సమావేశమా..?

ఆదివారం(ఫిబ్రవరి 7) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. వీటితో పాటే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయంపై కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేయవచ్చునన్న చర్చ జోరందుకుంది.

పార్టీ అధ్యక్షుడి మార్పు..?

పార్టీ అధ్యక్షుడి మార్పు..?

ఉన్నట్టుండి కేసీఆర్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం వెనుక పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశం కంటే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయబోయే అంశమే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా కేసీఆర్ ఇదే సమావేశంలో కీలక ప్రకటన చేయవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.

భారీ ఎత్తున యాగం... అందుకేనా?

భారీ ఎత్తున యాగం... అందుకేనా?

మరోవైపు ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన అధి శ్రావణ యాగంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో ఆయుష్ హోమాలు,గణపతి హోమాలు,చంఢీ హోమాలు నిర్వహించారు. అయితే ఈసారి 10వేల మంది హాజరయ్యేంత భారీ స్థాయిలో యాగాన్ని నిర్వహిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. లోక కల్యాణం కోసమే అని చెప్తున్నప్పటికీ... కేసీఆర్ లెక్కలు వేరేగా ఉండొచ్చునన్న వాదన వినిపిస్తోంది. అయితే ఆ లెక్క కేటీఆర్‌ను సీఎం చేయడానికి సంబంధించిందేనా లేక మరేదైనా అన్నది అంతుచిక్కడం లేదు.

పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్...?

పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్...?

ఈ ఆదివారం జరగబోయే పార్టీ కార్యవర్గ సమావేశం,ఈ నెల 17న నిర్వహించబోయే అధి శ్రావణ యాగం తర్వాత కేటీఆర్ పట్టాభిషేకం దిశగా అడుగులు పడబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ఏడాది జనవరి 7 తర్వాత నుంచి ఐదు నెలల పాటు మూఢాలే అన్నది పండితులు చెబుతున్న మాట. ఏ పని చేయాలన్న ముహూర్తం చూసుకుని తప్ప చేయని కేసీఆర్... తనయుడిని సీఎం చేసేందుకు పక్కా ముహూర్తం చూడనిదే కార్యం మొదలుపెట్టరు. కేటీఆర్‌కు వాటి పట్ల విశ్వాసం ఉందా లేదా అన్నది పక్కనపెడితే పట్టాభిషేకానికి తండ్రి మాటను ఫాలో అవక తప్పదు. కాబట్టి కేటీఆర్ పట్టాభిషేకం మే నెలలోనే ఉండవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అంతకన్నా ముందు కేసీఆర్ సీఎం కుర్చీ నుంచి తప్పుకోవడం,పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకోవడం తదితర పరిణామాలు జరగాల్సి ఉంటుంది కాబట్టి... అందుకోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+