ప్లాన్ ప్రకారమే.. ఘట్‌కేసర్ అత్యాచార కేసులో షాకింగ్ విషయాలు.. గతంలోనూ నలుగురిపై రేప్...
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో బీఫార్మసీ యువతిపై అత్యాచార ఘటనలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. నిందితులు ముందస్తు ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువతి ప్రాణాలతో ఉంటే నేరం బయటపడుతుందని ఆమెను హత్య చేయాలని కూడా భావించినట్లు సమాచారం.కానీ అప్పటికే పోలీసులు ముమ్మరంగా వారి కోసం గాలిస్తుండటంతో యువతిని అక్కడే వదిలేసి పరారయ్యారు. గతంలోనూ వీరు పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

విద్యార్థినిపై కన్నేసిన ఆటోడ్రైవర్...
ఈసీఐఎల్ సమీపంలోని ఆర్ఎల్ నగర్‌కు చెందిన బాధిత యువతి(19) మేడ్చల్ సమీపంలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఆర్ఎల్ నగర్ నుంచి రాంపల్లి చౌరస్తా వరకు ఆటోలో వెళ్లి అక్కడినుంచి బస్సులో కాలేజీకి వెళ్తుంటుంది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా రాంపల్లి చౌరస్తా వరకు బస్సులో వచ్చి... అక్కడినుంచి ఆటోలో ఇంటికి వెళ్తుంటుంది. ఈ క్రమంలో రాంపల్లి చౌరస్తా నుంచి ఆర్ఎల్ నగర్ మార్గంలో సెవెన్ సీటర్ ఆటో నడిపే ఓ డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. తన సహచర ఆటోడ్రైవర్లయిన మరో ముగ్గురికి కూడా ఈ విషయాన్ని చెప్పాడు.

ఇలా కిడ్నాప్...
రోజూ లాగే ఆ యువతి బుధవారం(ఫిబ్రవరి 10) సాయంత్రం 5.30గం. సమయంలో రాంపల్లి చౌరస్తాలో బస్సు దిగి ఆటో స్టాండ్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో సెవెన్ సీటర్ ఆటో డ్రైవర్ అక్కడే మాటు వేశాడు. యువతిని చూడగానే స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపటికి యువతి అదే ఆటో ఎక్కింది. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు,ఒక యువకుడు ఎక్కారు. అయితే ఆ ముగ్గురు కొద్ది దూరంలోనే దిగిపోగా...ఆ యువతి మాత్రమే ఆటోలో మిగిలింది. దీంతో ఇదే అదనుగా భావించి ఆ ఆటోడ్రైవర్... ఆర్ఎల్ నగర్ స్టాప్ వద్ద ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు.

ఘట్‌కేసర్‌కు తీసుకెళ్లి మరో వ్యానులోకి...
డ్రైవర్ ఆటోను ఆపకపోవడంతో కంగారుపడ్డ యువతి ఇంటికి ఫోన్ చేసి సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నలువైపులా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అప్పటికే ఆ ఆటోడ్రైవర్ ఆటోను యంనంపేట వద్ద ఆపి... మరో ఆటోలోకి ఎక్కించాడు. అక్కడే మరో ఇద్దరు కూడా అతనితో జతకలిశారు. అక్కడినుంచి ఘట్‌కేసర్ వైపు ఆటోలో యువతిని తీసుకెళ్లారు. ఘట్‌కేసర్ శివారులో అప్పటికే సిద్దంగా ఉన్న మరో వ్యానులోకి ఎక్కించారు.

మత్తుమందు.. అత్యాచారం..?
యువతి కేకలు పెట్టకుండా ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అనంతరం అదే వ్యానులో మొత్తం నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే పోలీస్ సైరన్ వినగానే నిందితులు అప్రమత్తమయ్యారు. 'ఆటోలో యువతిని కిడ్నాప్ చేశారు.. ఎవరికైనా కనిపిస్తే సమాచారమివ్వాలి..' అని మైకుల్లో పోలీసులు ప్రకటించడాన్ని గమనించారు. దీంతో దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయంతో యువతిని చెట్ల పొదల్లో పడేసి పరారయ్యారు. రాంపల్లి చౌరస్తాలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో నలుగురిపై అత్యాచారం...
నిందితులకు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరిగా రాకపోకలు సాగించే యువతులు,మహిళలపై నిఘా పెట్టి వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నట్లు గుర్తించారు. అదను చూసి కిడ్నాప్ చేయడం... ఆపై మరో ఇద్దరు స్నేహితులను ఆటోలో ఎక్కించుకుని ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ సమీపానికి వెళ్తుంటారని తేల్చారు. అక్కడ అప్పటికే సిద్దం చేసిన వ్యానులో అత్యాచారాలకు తెగబడేవారని నిర్దారించారు. సహకరిస్తే హానీ తలపెట్టకుండా విడిచిపెడుతామని చెప్పేవారని.. లేదంటే విచక్షణారహితంగా దాడిచేసేవారని గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో మరో నలుగురు మహిళలపై కూడా వీరు అత్యాచారాలకు పాల్పడినట్లు గుర్తించారని సమాచారం.