కవిత కేసు విచారణ వాయిదా.. సుప్రీం ధర్మాసనం ముందు కవిత, ఈడీ హోరాహోరీ వాదనలు!!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనపై ఈడి విచారణను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం విచారణను మళ్లీ వాయిదా వేసింది. ఇక ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఈడి అధికారులు విచారించడంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కవిత తరపు న్యాయవాది ఈరోజు తన వాదన వినిపించారు. కవిత తరపున వాదించిన న్యాయవాది కపిల్ సిబాల్, ఈడి తరఫున సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా, ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఎవరికి వారు హోరాహోరీగా బలంగా వాదించారు.

సిఆర్పిసి సెక్షన్ 160 ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉల్లంఘించిందని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. చట్ట ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటి దగ్గరే విచారణ జరపాలని, కానీ వ్యక్తిగతంగా హాజరుకావాలని తనకు సెక్షన్ 50 ప్రకారం నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని కవిత తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు.
అయితే పీఎంఎల్ఏ కేసుల్లోకి సెక్షన్ 160 వర్తించదని ఈడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పి ఎం ఎల్ ఏ సెక్షన్ 50ని ధర్మాసనానికి వివరించారు. చట్ట ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచే అధికారాలు ఈడికి ఉన్నాయని ఈడి తరపు న్యాయవాది ఎస్వీ రాజు తమ వాదన వినిపించారు. ఇరు వర్గాల వాదనను విన్న సుప్రీం ధర్మాసనం ఈ కేసును మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత లిఖిత పూర్వక వాదనలు ఇవ్వాలని కోర్టు ధర్మాసనం సూచించింది. దీంతో మళ్ళీ కవిత వేసిన పిటీషన్ విచారణ మూడు వారాల తరువాత జరగనుంది.












Click it and Unblock the Notifications