కేటీఆర్ సీఎం కారు.. కొత్త పార్టీ పెడతారు, బండి సంజయ్ హాట్ కామెంట్స్..
సీఎం మార్పు అంశం గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోన్న మాట. కేసీఆర్ తర్వాత సీఎం ఎవరనే చర్చ చాలాసార్లు జరిగింది. కేటీఆర్ అని సంకేతాలు ఇచ్చినా.. పార్టీల అంతర్గతంగా నెలకొన్న సమస్య వల్ల ప్రకటించడం ఆలస్యమవుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, సీఎం పదవీ గురించి హాట్ కామెంట్స్ చేశారు. బండి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కేసీఆర్‌కు ఇష్టం లేదు..
కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం చేస్తున్నారని.. కానీ అది జరగదని చెప్పారు. మంత్రి పదవి రాకపోతే పార్టీ పెడతామని ముగ్గురు, నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని.. కేసీఆరే వాళ్లతో అలా మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లు కొత్త పార్టీ పెడితే ప్రభుత్వం పడిపోతుందని, అందువల్ల సీఎం అయ్యేందుకు కొద్దిరోజులు ఆగాలని కుమారుడికి కేసీఆర్ చెబుతారని తెలిపారు. ఇదివరకు సంతోష్‌రావు పేరు చెప్పి ఆపారు.. ఇప్పుడు ఎమ్మెల్యేల పేరు చెప్పి ఆపుతున్నారు అని సంజయ్ వివరించారు.

అడ్డగోలుగా దోస్తున్నారు..
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అడ్డగోలుగా దోచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్‌ఐ నుంచి ఉన్నతాధికారి వరకు సీఎం, సీఎంవో పేరు చెప్పి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభ్యర్థిస్తే ఆయన రూ.53 కోట్లు మంజూరు చేశారు. ఈ పనికి టెండర్లే తెరవలేదు. కానీ పనులు మాత్రం ప్రారంభించారని మండిపడ్డారు. ఆ పని కాంట్రాక్టు చేసిన వ్యక్తికే వస్తుందని ఎలా తెలుస్తుంది.. అంటే, ప్లాన్ ప్రకారం, డమ్మీ వ్యక్తితో నామినేషన్ వేయిస్తారు.. ఈ లోగా అసలు వ్యక్తి వస్తాడు.. అధికారులు ఆయనకే కొమ్ముకాస్తారు.. ఏఈ నుంచి ఈఎన్‌సీ వరకు కాంట్రాక్టర్‌కే మద్దతు పలుకుతారని సంజయ్ విమర్శించారు.

అవినీతికి వ్యాక్సిన్
తెలంగాణ ప్రజలు అవినీతికి వ్యాక్సిన్ కనిపెట్టారని, దానిని ఫాంహౌస్, ప్రగతి భవన్‌పై ప్రయోగిస్తామని బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు సంస్కారంగా మాట్లాడాలని చెప్పారు. కుమారుడు/ కుమార్తెను సీఎంను చేయాలనుకుంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను సీఎంగా చేయడానికే ఓట్లు వేశారని అన్నారు.