ktr prime minister modi modi government bjp kcr telangana government తెలంగాణ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ బీజేపి politics
చేసిన అభివృద్ది చెప్పుకుందాం.!అభ్యర్ధులను గెలిపించుకుందాం.!టీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేటీఆర్.!
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను విమర్శించే వారికి త్వరలోనే గుణపాఠం చెప్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉద్ఘాంటించారు. తెలంగాణ భవన్ లో జరగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణను హేళన చేసిన పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు ఒక్కడే ఎదురు నిలబడి కుంగిపోకుండా తెలంగాణ సాధించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేసారు. అలాంటి చంద్రశేఖర్ రావును గౌరవం లేకుండా కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని, గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగా ఉంటుందని, సమయం వచ్చినప్పుడు తుపాకీ విలువ తెలుస్తుందని చంద్రశేఖర్ రావు మౌనం గురించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు కేటీఆర్.

తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం.. ఉత్తేజాన్నిచ్చిన మంత్రి కేటీఆర్ ప్రసంగం..
అంతే కాకుండా తెలంగాణ అంశమే తెరమరుగైన పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు మాత్రమే తెలంగాణ అంశాన్ని మేల్కొలిపారని కేటీఆర్ గుర్తు చేసారు.
మీడియా, మనీ, మజిల్ పవర్ అప్పట్లో చంద్రశేఖర్ రావుకు అపుడేవి లేదని కేటీఆర్ వివరించారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో చంద్రశేఖర్ రావు ఒక్కడే ఇరవై యేండ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తన పదవులను గడ్డిపోచలా త్యాగం చేసి, లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్ళ తో కొట్టి చంపండి అని పిలునునిచ్చిన దమ్మున్న నేత చంద్రశేఖర్ రావు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్ వ్యూహాత్మక మౌనం.. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తామన్న కేటీఆర్..
విద్యా ,ఉద్యోగ అవకాశాలు తెలంగాణ వచ్చిన తర్వాత భారీగా పెంచిన ఘనత చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు, కాలేజీలను తెలంగాణలో వందల శాతం పెంచుకున్నామని, ఇవన్నీ తెలియకుండా కొందరు రాజకీయ సన్నాసులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఇవన్నీ చేస్తే కేంద్రం లో ఉన్న బీజేపీ విద్యాపరంగా చేసింది గుండు సున్న అని వ్యాఖ్యానించారు. కొత్త ఐఐఎం, ఐ ఎస్ ఆర్, ఐ ఐ టీ, ట్రిపుల్ ఐటీ సంస్థలను దేశమంతా ప్రకటించిన బీజేపీ తెలంగాణ కు ఇచ్చింది మాత్రం గుండుసున్నా అని స్పష్టం చేసారు. తెలంగాణ పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న బీజేపీ కి తెలంగాణ లో ఎందుకు ఓటేయాలని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

బీజేపి ప్రగల్బాల పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్న కేటీఆర్..
అంతే కాకుండా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తుంటే ఇక బయ్యారం లో బీజేపీ ఉక్కు ఫ్యాక్టరీ కడుతుందని చెప్పడం పూర్తి హాస్యస్పదమని కేటీఆర్ స్పష్టం చేసారు.
ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా ఉండేందుకు బీజేపీ ఇండియా పాకిస్థాన్ గురించి ప్రస్తావిస్తూ దేశ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తందని కేటీఆర్ మండిపడ్డారు. అసలు బీజేపీ నేతలకు తెలంగాణ దేశంలో అంతర్బాగమనే అంశం గుర్తుందా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు ద్వారా యువత సమాధానం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రెండు ఎమ్మెల్సీలు గెలవాలి.. ప్రభుత్వం అభివృద్దిని ప్రజలకు వివరించాలన్న మంత్రి కేటీఆర్..
అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ మాటలు కోట్లల్లో ఉంటాయని, చేతలు మాత్రం పకోడీల్లా ఉంటాయని కేటీఆర్ చమత్కరించారు. మోడీ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజి ఒక్కరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అందరి చిట్టాలు తమ దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్నీ బహిర్గతం చేస్తామని కేటీఆర్ వివరించారు. అంతే కాకుండా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలని అందుకు అందరూ పూర్తిగా మద్దత్తు ప్రకటించాలని, ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరించి అభ్యర్ధుల గెలుపుకు శ్రీకారం చుట్టాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి విజ్ఞప్తి చేసారు.