దమ్మాయిగూడలో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం: చెరువులో ఇందు మృతదేహం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన ఇందు అనే పదేళ్ల బాలిక.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం దమ్మాయిగూడలోని అంబేద్కర్ నగర్ చెరువులో లభ్యమైంది.
కాగా, నాల్గవ తరగతి చదువుతున్న ఇందు గురువారం తప్పిపోయింది. డిసెంబర్ 15వ తేదీ ఉదయం ఇందు తండ్రి దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద బాలికను వదిలిపెట్టి వెళ్లగా.. ఆ తర్వాత నుంచి పాప కన్పించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఇందు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు.

బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభించింది.
అయితే, బాలికను ఎవరైనా కిడ్నాప్ చేసి హత్య చేశారా? లేక ప్రమాదవశాత్తు బాలిక చెరువులో పడి మృతి చెందిందా? అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల పరిసరాలు, మిగితా చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
దమ్మాయిగూడలో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం: చెరువులో ఇందు మృతదేహం..!! pic.twitter.com/NIloR73Xsy
— oneindiatelugu (@oneindiatelugu) December 16, 2022
బాలిక మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దమ్మాయిగూడ చౌరస్తాలో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ పాఠశాల సిబ్బంది, పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
కాగా, బాలిక శరీరంపైగానీ, అంతర అవయవాలపైన గానీ గాయాలు లేవని, నీరు మింగడం వల్లే ఇందు మృతి చెందిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
మరోవైపు, బాలిక మృతిపై స్పష్టమైన నివేదిక కావాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోనళన చేపట్టారు. అటుగా వచ్చిన పోలీసు వాహనంపైనా దాడి చేశారు. బాలిక మృతదేహంతో నిరసన చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications