Metro: జనవరి ఒకటో తేదీ అర్ధ రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు
ప్రయాణికులకు శుభవార్త అందించింది మెట్రో.. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి ఒకటో తేదీ అర్ధ రాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్
చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని చెప్పారు. డిసెంబర్ 31 సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అయితే మెట్రో రైలు ప్రయాణికులు త్వరలో బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.

రైలు ఛార్జీల
మెట్రో అధికారులు మెట్రో రైలు ఛార్జీల పెంచడానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటికే సెంట్రల్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ఈ కమిటీలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్యామ్ ప్రసాద్ చైర్మన్‌గా, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సురేంద్ర కుమార్ బాగ్డే, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

ఖర్చులు పెరిగిన నేపథ్యంలో
మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కోవిడ్ కారణంగా నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న హైదరాబాద్ మెట్రో మూడు లైన్ల ద్వారా ప్రతిరోజూ 4.20 లక్షల నుంచి 4.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇప్పుడు సమయంతో సంబంధం లేకుండా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

రూ.20
ప్రస్తుతం 2 కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర ప్రస్తుతం రూ.10. అలాగే 2-4 కి.మీ.కు రూ.15, 4-6 కి.మీ. దూరానికి రూ.25, 6-8 కి.మీ.కు రూ.30, 8-10 కి.మీ.కు రూ.35, 10-14 కి.మీ.కు రూ.40, 14-18 కి.మీ.కు రూ.45, 18-22 కి.మీ.కు రూ.50, 22-26 కి.మీ.కు రూ.55, 26 కిలోమీటర్లకు పైగా దూరానికి రూ.60 వసూలు చేస్తున్నారు. ధరల పెంచితే మినీమమ్ రూ.20, మ్యాగ్జిమమ్ రూ.80 చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications