రేపు రుతుపవనాల ఆగమనం.. చల్లబడిన వాతావరణం.. వర్షం
నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. గత నెల 29వ తేదీన కేరళలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తర్వాత వాటి కదలిక మందగించింది. వర్షాలు కూడా అనుకున్న విధంగా పడలేదు. ప్రతీ ఏటా రుతుపవనాలు ప్రవేశించిన మొదటి వారంలో 6 నుంచి 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యేది. ఈ సారి కేరళలో కేవలం 5 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇప్పుడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది.

రేపు ఆగమనం..
రేపు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చల్లని కబురు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మీదున్న ఉపరితల అవర్తనం నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్ వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఈదురుగాలులు
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతోపాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వాన పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

మారిన వాతావరణం
వానలు.. ఎండలతో తెలంగాణలో వాతావరణం మారిపోనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పగలంతా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ జిల్లాల్లో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం, రాత్రి సమయాల్లో చల్లని గాలులు, వానలు పడే అవకాశం ఉందని.. మధ్యాహ్నం ఎండలు దంచికొడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications