మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్-కోవిడ్ నిబంధనలు బేఖాతరు
మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోని చేపల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఉన్న ఫిష్ మార్కెట్ జనాలతో కిక్కిరిసిపోయింది. సాధారణంగా వీకెండ్స్‌లో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. మంగళవారం(జూన్ 8) మృగశిర కార్తె కావడంతో మరింత రద్దీ మరింత పెరిగింది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు మార్కెట్‌లో అమలవట్లేదు. జనాలను కట్టడి చేసేందుకు మార్కెట్ వద్ద పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.
మృగశిర రోజున చేపల కూరతో భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే మృగశిర వచ్చిందంటే చాలు ఇంట్లో చేపల ఘుమఘుమలు గుప్పుమంటాయి. మృగశిర రోజున చేపలు తినడం ద్వారా గుండె జబ్బులు,అస్తమా వంటి వ్యాధులు దరిచేరవని చాలామంది భావిస్తారు. రోహిణి తర్వాత వచ్చే మృగశిరలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. రోళ్లు పగిలే ఎండల నుంచి వాతావరణం చల్లగా మారుతుంది. చేపలు తినడం ద్వారా వాతావరణంలో వచ్చే ఈ మార్పులను శరీరం తట్టుకోగలదని చాలామంది భావిస్తారు.

సాధారణంగా చేపలు మంచి పోషక ఆహారం. చేపలను తినడం ద్వారా మాంసకృత్తులతో పాటు శరీరానికి కావాల్సిన కాల్షియం, పాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఖనిజ పోషకాలు శరీరానికి లభిస్తాయి. పైగా చేపలు సులభంగా జీర్ణమయ్యే ఆహారం. పిల్లలు మొదలు వృద్దుల వరకూ నిస్సంకోచంగా చేపలను భోజనంగా తీసుకోవచ్చు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో చేపలు మంచి పోషకాహారం అని... రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ రోజుల్లో కిలో కొర్రమీను ధర రూ.300-600 పలుకుతుంది. మృగశిర ఎఫెక్ట్‌తో ఇప్పుడది డబుల్,ట్రిపుల్ కూడా పలుకుతోంది. మృగశిర రోజున తప్పకుండా చేపలు తినాలన్న జనం సెంటిమెంటు చేపల వ్యాపారులకు కలిసొస్తోంది.












Click it and Unblock the Notifications