పెళ్లయిన రెండు నెలలకే.. హైదరాబాద్‌లో నవ వధువు ఆత్మహత్య..
పెళ్లయిన రెండు నెలలకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు ఆమె భర్త పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్య వెనుక కారణాలను చేధించే పనిలో పడ్డారు.

అసలేం జరిగింది..
హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన పల్లవి(28)కి,వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన సోమవరం సంతోష్‌తో గతేడాది డిసెంబర్ 8న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సంతోష్‌కు కట్నంగా రూ.1లక్ష,ఇతరత్రా కానుకలు ఇచ్చారు. సంతోష్ వనస్థలిపురంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. పెళ్లికి ముందు ఉద్యోగం చేసిన పల్లవి.. ఆ తర్వాత మానేసింది.

తలుపులు బద్దలుకొట్టగా..
గురువారం సంతోష్ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అత్త,మామలు అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి నుంచి కోడలితో మాట్లాడేందుకు ఫోన్ చేయగా.. పల్లవి నుంచి ఎటువంటి స్పందనా లేదు. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో పక్కింటివారికి సమాచారం అందించారు. అయితే పక్కింటివారు వెళ్లి తలుపు తట్టినా స్పందన లేదు.

భర్తపై బాధితురాలి తల్లిదండ్రుల అనుమానం..
కంగారుపడ్డ అత్త,మామలు తలుపులు పగలగొట్టి చూడమని వారికి చెప్పారు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ పల్లవి కనిపించింది. వెంటనే పల్లవి భర్త,అత్తమామలకు సమాచారం అందించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి తల్లిదండ్రులు భర్త పైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications