జేపీ నడ్డాతో నితిన్ భేటీ: బీజేపీ తరఫున ప్రచారం, మిథాలీ రాజ్ కూడా: లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విస్తరణపై ఫోకస్ చేసింది. ఇటీవల అమిత్ షా మునుగోడు బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు. ఇవాళ హన్మకొండలో జరిగిన సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. సభలో ప్రసంగించిన తర్వాత.. హైదరాబాద్ వచ్చారు. నోవాటెల్ హోటల్‌లో సినీ నటుడు నితిన్ కలిశారు.
శనివారం రాత్రి టాలీవుడ్ హీరో నితిన్.. జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బీజేపీ నేతల ఆహ్వానం మేరకు నోవాటెల్ హోటల్‌కు వచ్చారు. సమావేశంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కూడా పాల్గొన్నారు. ఏ అంశాల ప్రాతిపదికన భేటీ జరుగుతోందన్న విషయం తెలియలేదు.

గత ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ముగిసిన వారం వ్యవధిలో జేపీ పడ్డా మరో టాలీవుడ్ హీరోతో భేటీ అంటే ఆసక్తి రేకెత్తిస్తోంది.
నడ్డాతో నితిన్ భేటీ.. అరగంట పాటు సాగింది. ఆ తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా నడ్డాతో సమావేశమైన సంగతి తెలిసిందే. నితిన్, మిథాలిరాజ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సానుకూలంగా ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. జేపీ నడ్డా చేసిన ప్రతిపాదనకు వారిద్దరూ అంగీకరించారని తెలిపారు. ప్రధాని మోడీ కోసం అవసరమైతే బీజేపీ తరఫున పని చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెప్పారని లక్ష్మణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications