తెలంగాణా సచివాలయ కూల్చివేతకు ప్లాన్ రెడీ .. కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో కూల్చివేత
Recommended Video
టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఈ నేపధ్యంలో పాత భవనాల కూల్చివేత నిర్వహించనున్నారు. కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో కూల్చివేత చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేలుడు పదార్ధాలను ఉపయోగించి ఒక క్రమ పద్దతిలో బ్లాసింగ్ చేసి పాత సచివాలయాన్ని కూల్చివేయనున్నారు.

కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో సచివాలయ భవన కూల్చివేత నిర్ణయం .. ఎందుకంటే
ప్రతిపక్షాలు పాత సచివాలయ భవనాన్ని కూల్చివెయ్యొద్దని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యొద్దని గగ్గోలు పెడుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం తనపని తాను చేసుకుపోతున్నారు. పాత సచివాలయ భవనాన్ని కూల్చి వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . ఇక ఈ కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో భవంతుల పునాదుల నుంచి అన్ని అంతస్తుల పిల్లర్లను డ్రిల్ చేసి, డైనమైట్లను అమర్చి, వాటిని ఓ క్రమ పద్ధతిలో పేల్చడం ద్వారా, భవంతిని కూల్చివేస్తారు. ఈ పద్ధతిలో చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాలకు ఏ విధమైన నష్టమూ కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పద్ధతి ద్వారా కూల్చివేత పని త్వరగా పూర్తి కావటమే కాకుండా ఇతర భవనాలకు హాని ఉండదు. ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలున్నాయి. ఒక్కో భవనం ఒక్కో బ్లాకుగా మొత్తం పది భవనాలున్నాయి. వీటన్నింటినీ ఇదే విధానంతో కూల్చి వెయ్యనున్నారు.

దుమ్ము ధూళితో ఇబ్బంది లేకుండా సచివాలయ కార్యాలయాల తరలింపు నిర్ణయం
సచివాలయంలో జీ బ్లాకుగా ఉన్న నిజాం హయాంలో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ అన్నింటికంటే పురాతనమైన భవనం . మిగతావి ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి తదితరులు ముఖ్యమంత్రులుగా ఉండగా నిర్మించినవి. ఇక కాగా, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాలున్న డి బ్లాక్ భవనం కొత్తది. ఇప్పుడు ఈ భవనాలన్నింటినీ కూల్చివేయనున్నారు. తొలుత ఎ, బి, సి, డి బ్లాకుల్లోని కార్యాలయాలను హెచ్, జే, కే బ్లాకుల్లోకి తరలించి వాటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా బీఆర్‌కే భవన్‌ను ఎంపిక చేసి అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. వారం రోజుల్లో సచివాలయ కార్యాలయాలు అందులోకి తరలిపోనున్నాయి. దుమ్ము ధూళితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు .

మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కూల్చివేతపై చర్చించి నిర్ణయం ... నిపుణులతో సంప్రదింపులు
సచివాలయం మొత్తం ఖాళీ కాగానే కూల్చివేతల పర్వం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. పది బ్లాకులుగా పెద్దపెద్ద భవనాలున్నందున వాటిని సంప్రదాయ పద్ధతిలో కూల్చివేయటానికి చాలా సమయంతో పాటు ,కూల్చివేత సమయంలో దుమ్ము ధూళితో పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడతారని భావించి ఆధునిక పద్ధతిలో కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణులను పిలిపించి చర్చించనున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీలు సచివాలయ కూల్చివేత విషయంలో ఎంత పోరాటం చేసినా , కోర్టుకెళ్ళినా సీఎం కేసీఆర్ మాత్రం నేను మోనార్క్ ని అన్న చందంగా ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు.












Click it and Unblock the Notifications