కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోడీ సంతాపం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కృష్ణంరాజు మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. సినీ రంగంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు.
కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని.. తనకు ఎంతో ఆప్త మిత్రుడని కేసీఆర్ అన్నారు. ఆయన ఆదేశాలతో కృష్ణంరాజు అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణంరాజు పార్థివదేహం ఏఐజీ ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. అక్కడ అభిమానులు, సన్నిహితుల సందర్శన కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. కృష్ణంరాజు మృతిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీడీపీ నేత నారా లోకేష్, సీపీఐ నేత నారాయణ సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి
— Narendra Modi (@narendramodi) September 11, 2022
ఇటు కృష్ణంరాజు మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం అని అన్నారు. మా ఊరి హీరో అని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో తన తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుతో చేసిన సినిమాలను గుర్తుచేశారు.'రెబల్ స్టార్'కి ఆయన నిజమైన నిర్వచనం అని చిరంజీవి అన్నారు. ప్రభాస్, కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.












Click it and Unblock the Notifications