కేసీఆర్‌ది దొంగ ప్రేమ! పీవీని అవమానించారు: హోర్డింగులతో డబ్బులు దొబ్బారు: బండి ఫైర్
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని విమర్శించారు. అంత బిజీ ఏముందని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎక్కడ?
పదవుల కోసం ఆలోచన చేయని వ్యక్తి పీవీ నర్సింహారావు అన్నారు బండి సంజయ్. దేశంలో మెజార్టీ ప్రజల నిర్ణయం మేరకు రామ జన్మభూమి కోసం పీవీ తమ పాత్ర పోషించారని తెలిపారు. ప్రజాదరణ పొందిన వ్యక్తి పీవీ అని.. అందుకే ఆయన దేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచారని ప్రశంసించారు. ఇక సీఎం కేసీఆర్‌పై గుప్పిస్తూ.. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని అన్నారు. పీవీ వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

హోర్డింగులు పెట్టి డబ్బులు దొబ్బారు..
పీవీ శతజయంతి ఉత్సవాలు ఎక్కడా కనిపించడం లేదని.. హోర్డింగులు పెట్టి డబ్బులు దొబ్బారని బండి సంజయ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ మళ్లీ బయటకి రాలేదని సంజయ్ అన్నారు.

సీఎం కేసీఆర్ అసలు ఏం చేస్తున్నారు..?
కేసీఆర్ ఈరోజు అంత బిజీ ఏముందని ప్రశ్నించిన ఆయన.. సీఎం షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రారని చెప్పిన ఆయన.. ఇప్పుడు పీవీ వర్ధంతి రోజు కూడా కేసీఆర్ రాకపోవడం పీవీని అవమానించడమేనని అన్నారు. బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ సహా బీజేపీ నేతలు పీవీకి నివాళులర్పించారు.

పీవీ మీద కేసీఆర్ దొంగ ప్రేమ..
మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పీవీ ఘాట్ కూలగొడతామంటే కేసీఆర్ ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. పీవీ నర్సింహారావు మీద కేసీఆర్ దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. పీవీని చూసి భారతీయ అంటే ఏంటో నేర్చుకోవాలని కేసీఆర్‌కు ఆయన హితవు పలికారు. పీవీని స్మరించుకుంటే భారతీయులు తమను తాము గుర్తు చేసుకున్నట్లేనని అన్నారు. భారతీయత అనే గర్వం ఆయన చనిపోయేవరకు ఉంందని అన్నారు.