ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: దోషికి ఉరిశిక్ష విధించిన సైబరాబాద్ కోర్టు
హైదరాబాద్: నగర శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. 2017 నాటి ఈ కేసులో దోషి దినేష్ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. రూ. 1000 జరిమానా విధించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నార్సింగి పరిధిలో 2017 డిసెంబర్ 12న ఆరేళ్ల బాలిక అపహరణకు గురైంది. బాలిక కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికారు తల్లిదండ్రులు. కాగా, స్థానికంగా ఉన్న నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం బయటపడుతుందనే భయంతో ఆమెను బండరాయితో మోది హత్య చేశాడు.

ఈ క్రమంలో ఓ భవనం సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడివున్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు తల్లిదండ్రులు. వెంటనే నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, తల్లిదండరులు ఇచ్చినక సమాచారంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించారు పోలీసులు.
నిందితుడి గదిలో లభించిన పలు సాంకేతిక ఆధారాలను కూడా సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. 2017 నాటి ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి రూ. 1000 జరిమానాతో పాటు ఉరిశిక్షను విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు పట్ల బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.