అదో పెద్ద కేసీఆర్ సురభి నాటకం: వృద్ధుడికి సాయంపై రేవంత్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: ఓ వృద్ధుడికి సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదంతా ఓ పెద్ద నాటకమని కొట్టిపారేశారు. పట్నంగోస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేవంత్ రెడ్డి కూకట్‌పల్లిలో పర్యటించారు.
టీఆర్ఎస్ నేతలే ధనవంతులయ్యారు..
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పంపిణీలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు నెలల్లోగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారు కానీ.. పేద ప్రజలకు మాత్రం ఇళ్లు రాలేదని విమర్శించారు.

కేటీఆర్ ఊర్లలో.. కేసీఆర్ నగరంలో..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్‌లు ఆర్భాటాల కోసం హడావుడి చేస్తూ ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఊర్లలో తిరుగుతుంటే.. ఆయన తండ్రి కేసీఆర్ హైదరాబాద్‌లో తిరుగుతూ.. సురభి నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Recommended Video


కేసీఆర్ సురభి నాటకం
సీఎం వస్తున్న మార్గంలో ఓ వృద్ధుడు దరఖాస్తుతో నిల్చుని ఉండటం.. అది చూసి కేసీఆర్ తన కారు ఆపడం.. ఇవన్నీ చూస్తుంటే సురభి నాటకాన్ని తలపిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రోడ్డుపై వృద్ధుడు.. అక్కడే సాయం చేసిన కేసీఆర్
కాగా, గురువారం హైదరాబాద్ నగరంలో సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలీచౌకి వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో దివ్యాంగుడైన ఓ వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో నిల్చున్నారు. అతడిని గమనించిన కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపించి.. కారు దిగి అతడ్ని కలిశారు. మొహమ్మద్ సలీం అనే ఆ వృద్ధుడు సీఎం కేసీఆర్‌కు తన సమస్యను వివరించారు. అతని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు కేసీఆర్ అక్కడే ఆదేశాలుజారీ చేశారు. పింఛను మంజూరు చేయడంతోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సలీం కుమారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందిస్తామని హామి ఇచ్చారు. దీంతో ఆ పెద్దాయన ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పైవిధంగా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications