శశిధర్ రెడ్డి, శ్రీధర్ బాబుతో రేవంత్ రెడ్డి భేటీ.. నేతందరికీ ఆహ్వానం
టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి రావాలని తన, పర అనే భేదం లేకుండా ప్రతీ ఒక్కరినీ పిలుస్తున్నారు. అందరినీ ఆయన కలుపుకొని పోతున్నారు. ముఖ్యంగా ఇదివరకు మరుగున పడ్డ నేతలను కలుస్తూ వస్తున్నారు. నేనున్నా అనే ధైర్యం ఇస్తూ.. ప్రతీ ఒక్క నేతతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు, రాజకీయాలు.. మరీ అలాంటి పార్టీలో అందరికీ స్నేహహస్తం ఇవ్వడం గ్రేటే.. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తన ధ్యేయం అని రేవంత్ రెడ్డి చర్యలను బట్టి అర్థం అవుతుంది.

మర్రి శశిధర్ రెడ్డి
ఇప్పటికే అందరూ నేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నిన్న పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలో రేవంత్ రెడ్డి పర్యటించారు. బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి రావాలని కోరారు. ఇవాళ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆయనతో మల్లు రవి కూడా ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. శశిధర్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకొని.. ముందడుగు వేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. శశిధర్ రెడ్డి తన అనుభవాన్ని అందజేయాలని రేవంత్ కోరారు.

శ్రీధర్ బాబు
తర్వాత మాజీమంత్రి శ్రీధర్ బాబుతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్ రెడ్డికి శ్రీధర్ బాబు విష్ చేశారు. శాలువా కప్ప సన్మానిచారు. సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రేపు టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం గాంధీ భవన్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.