దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం... డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు...
హైదరాబాద్‌లో నయా టూరిస్ట్ స్పాట్‌గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం(నవంబర్ 5) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ కారు టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ గోడను ఢీకొట్టడంతో... టైర్ పేలిపోయి పల్టీలు కొట్టిందని పోలీసులు తెలిపారు.
దుర్గం చెరువు బ్రిడ్జి ప్రారంభానికి ముందే అక్కడ జనం తాకిడి పెరిగింది. ఆకర్షణీయమైన ప్రదేశం కావడంతో చాలామంది ఇక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. కెమెరాలతో హడావుడి చేస్తున్నారు. వీకెండ్స్‌లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో వీకెండ్స్‌లో ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. శని,ఆదివారాల్లో కేవలం సందర్శకులను మాత్రమే బ్రిడ్జి పైకి అనుమతిస్తున్నారు.

దాదాపు రూ.184కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45-ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేస్తుంది. దీని పొడవు 754.38మీ. కాగా.. వెడల్పు ఆరు లేన్లు ఉంటుంది. ఎల్&టీ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించింది. దేశంలో కేబుల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.
పాదాచారులు,సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ రాత్రి సమయంలో బ్రిడ్జి అందాలను రెట్టింపు చేస్తోంది. రాత్రిపూట జిగేల్ కాంతుల నడుమ బ్రిడ్జి పైనుంచి చెరువు అందాలను వీక్షించడం మంచి అనుభూతిని ఇస్తోందని సందర్శకులు చెప్తున్నారు. ఒకరకంగా నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ బోటింగ్, రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో టూరిజం శాఖ ఉన్నది.
ఒకప్పుడు కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ నవాబులకు మంచి నీరందంచిన చరిత్ర దుర్గం చెరువుకు ఉన్నది. దాదాపు 83 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు దేశంలోని రహస్య తటాకాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది.












Click it and Unblock the Notifications