దక్షిణ మధ్య రైల్వే సంచలన రికార్డ్
దేశంలోని అన్ని రైల్వే జోన్లకన్నా ముందుండే దక్షిణ మధ్య రైల్వే సంచలన రికార్డు నెలకొల్పింది. మరోసారి అన్ని రైల్వేజోన్లకన్నా ఎక్కువ ప్రతిభను చూపించింది. ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాకు సంబంధించి గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. 141.117 మెట్రిక్ టన్నుల సరకును రవాణా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
2022-23 సంవత్సరంతో పోలిస్తే 8.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. పోయిన సంవత్సరంకన్నా ఈ సంవత్సరం రూ.506 కోట్ల అదపు ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.13వేల 438 కోట్లుగా ఉంది. జోన్ పరిధిలో ఉన్న ఆరు డివిజన్ల ద్వారా ఇది సాధ్యపడింది. దేశ రైల్వే సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే వాటా 11.18 శాతంగా ఉంది. సరకు రవాణాలో బొగ్గు 70.52 మెట్రిక్ టన్నులు, రెండో స్థానంలో సిమెంట్ 36.117 మెట్రిక్ టన్నులుగా ఉంది.

దక్షిణమధ్య రైల్వే ఏర్పాటైన మొదటి సంవత్సరం నుంచే సరకు రవాణాలోకానీ, ప్రయాణికుల టికెట్లద్వారా కానీ అన్ని జోన్లకన్నా అత్యధిక ఆదాయాన్ని సంస్థ సముపార్జిస్తోంది. జోన్ పరిధిలో సిమెంటు పరిశ్రమలు, ఇతర ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. గుంటూరు నుంచి నడికుడి, బీబీనగర్ మీదగా సికింద్రాబాద్ చేరుకునే మార్గంలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. వీటి రవాణాను సులభతరం చేసేందుకు సింగిల్ లైన్ గా ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్ గా చేయబోతున్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయిన తర్వాత రైల్వేకు ఆదాయం భారీగా రానుంది. సింగరేణి నుంచి కూడా బొగ్గును తరలించడంద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతోంది. సరకు రవాణాలో బొగ్గుదే కీలకపాత్ర. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి ద్వారానే బొగ్గు సరఫరా అవుతోంది.












Click it and Unblock the Notifications