విశాఖ రావాలని కేటీఆర్ ను ఆహ్వానించిన విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు తన మద్దతు ప్రకటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే ఏపీకి వెళ్లి ఉద్యమం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పై విమర్శలు వెల్లువెత్తగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటీఆర్ పై అభిమానం పెల్లుబుకుతుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా నిలుస్తామని చెప్పిన కేటీఆర్ కు పాలాభిషేకాలు చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రకటన నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో ఐటి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. వారు విశాఖపట్నం సందర్శించి, స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అనుమతితో రిలే నిరాహార దీక్షలో పాల్గొంటానని కెటిఆర్ వియుపిపిసి నాయకులకు హామీ ఇచ్చారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహిస్తుంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. ఇక ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు విక్రయించకుండా అడ్డుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు అఖిలపక్ష పార్టీల నాయకులు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం నుండి మద్దతు లభించడంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మంత్రి కేటీఆర్ ను కలిసి విశాఖలో కొనసాగుతున్న దీక్షలు శిబిరాలను సందర్శించాలని కోరారు. తమ పోరాటానికి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications