హైదరాబాద్ లో అనుమానస్పద పేలుడు..! ఆరుగురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టోలిచౌకి ప్రాంతంలో జరిగిన పేలుడు భయాందోళనలు రేకెత్తించింది. బసవతారకరామ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అనుమానస్పద పేలుడులో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అదలావుంటే పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టోలిచౌకి బసవతారకరామ నగర్ లో పేలుడు సంభవించిందన్న సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు తేల్చారు. అందులో నలుగురి పేర్లు వెల్లడించారు. ఓటర్ కార్డు తదితర వివరాలతో మహ్మద్ అబ్దుల్ (24), మహ్మద్ సాజిద్ (28), మహ్మద్ నిసార్ (35), మహ్మద్ ఇలియాజ్ (36) గా గుర్తించారు.

గెలాక్సీ థియేటర్ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. క్షణాల్లో ఈ విషయం బయటకు పొక్కడంతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. జనావాసాల మధ్య పేలుడు జరగడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నా.. మరో కోణం ఉందేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications