వర్షాలపై సీఎస్ సమీక్ష: 19వేల మంది తరలింపు, 36 ఏళ్ల తర్వాత భద్రాద్రిపై రాకపోకల నిలిపివేత
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయం, పునరావాస కార్యక్రమాలపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని, ఏ విధమైన భారీ నష్టం జరగలేదని వెల్లడించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని తెలిపారు.

ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 16 మందిని, వైమానిక దళం ఇద్దరిని రక్షించాయని సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాల్లో 19,071 మంది ఆశ్రయం పొందుతున్నారరని తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్. భద్రాచలంలోని 43 శిబిరాల్లో 6,318 మంది, ములుగు జిల్లాలోని 33 శిబిరాల్లో 4,049 మంది, భూపాలపల్లి జిల్లాలోని 20 శిబిరాల్లో 1,226 మందికి ఆశ్రయం కల్పించామన్నారు.
36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంక్షలు, భద్రాద్రి వారధిపై రాకపోకల నిలిపివేత
భారీ వర్షాలు, వరదల ప్రభావంతో భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు. రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి. దీంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఈ మేరకు ఆంక్షలు విధించారు. తాజాగా 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్ కానున్నాయి. సాయంత్రం 5 గంటలనాటికి ఇక్కడ వరద మట్టం.. 61.80 అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఇప్పటికే భద్రాచలం పట్టణం నీటమునిగింది. మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications