కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్: టాటూ వేసిందెవరంటే?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ పేరును ఆమె తన చేతికి పచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమురంభీమ్ సహచరుని వారసులు ఆ పచ్చబొట్టు వేయడం విశేషం.
జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారాభవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఆదివాసీ, బంజారాలు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు.

ఆదివాసీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తున్న సమయంలో పచ్చబొట్టు స్టాల్ కూడా కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయాలని కోరారు. పచ్చబొట్టు వేయించుకోవడం అనేది నొప్పితో కూడినది అని నిర్వాహకులు చెప్పినప్పటికీ.. కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయాల్సిందేనని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఇక ఆమె నొప్పిని భరిస్తూ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు.
సీఎం శ్రీ కేసీఆర్ గారిపై కృతజ్ఞతతో గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానంతో వారి పేరు చేతిపై పచ్చబొట్టు.
— Satyavathi Rathod (@Satyavathi_BRS) June 10, 2023
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ లోని బంజారా భవన్లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొని, గిరిజన యోధుడు కొమురం భీమ్ సహచరుని వారసులతో పచ్చబొట్టు వేయించుకోవడం జరిగింది. pic.twitter.com/zZiDan3TyU
అయితే, మంత్రి సత్యవతికి కొమురంభీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రంబాయి పచ్చబొట్టు వేయడం విశేషం. అనంతరం ఆమెను అభినందించిన మంత్రి సత్యవతి.. నగదు బహుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సహించాలని.. సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు మంత్రి సత్యవతి. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.












Click it and Unblock the Notifications