జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత: బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై మండిపడ్డ బీజేపీ కార్పొరేటర్లు.. కౌన్సిల్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 8 గంటలపాటు కౌన్సిల్‌లోనే బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కౌన్సిల్‌లోకి ప్రవేశించిన పోలీసులు.. బీజేపీ కార్పొరేటర్లను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.
కార్పొరేటర్లను బలవంతంగా మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల తోపులాటలో పలువుు మహిళా కార్పొరేటర్లకు గాయాలయ్యాయి.కాగా, కరెంట్ కట్ చేసి బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. వాటర్ బోర్డు అధికారుల బాయ్ కాట్‌తో కౌన్సిల్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కార్పొరేటర్ల ను బీజేపీ ఆఫీస్ సమీపంలో వదిలిపెట్టామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆదేశించారని తెలుస్తోంది. మొత్తానికి తీవ్ర ఉద్రిక్తత మధ్యే కార్పొరేటర్లను బయటకు లాక్కెళ్లడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కౌన్సిల్ సమావేశం తూతూమంత్రంగా నిర్వహించారని బీజేపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. తమకు జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య గొడవలు సృష్టించి మేయర్ మాయమయ్యారని ఆరోపించారు.
సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 15 నిమిషాలలోనే సభను నిర్వహించి వాయిదా వేశారని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తోందన్నారు.

నేడు వాయిదా వేసిన సభను మళ్లీ ఎప్పుడు పెడతారో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. నగరంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ చర్చించడం లేదని మండిపడ్డారు. మరోవైపు, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు గందరగోళం సృష్టించడం వల్లే సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
BJP కార్పొరేటర్లు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక మేయర్ గద్వాల విజయలక్ష్మి గారితోపాటు..... HMWSSB మరియు GHMC సిబ్బంది పారిపోయారు pic.twitter.com/gtiuseMwAw
— keshaboina sridhar (@keshaboinasri) May 3, 2023
కాగా, జీహెచ్ఎంసీ అధికారులు వాకౌట్ చేయడంపై తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత స్పందించారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని కోరారు. లేని పక్షంలో అధికారులుగా సహకరించమని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత దోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశం బైకాట్ చేసినట్లు తెలిపారు. మంగళవారం జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు అధికారులతో అనుచితంగా ప్రవర్తించారన్నారు.












Click it and Unblock the Notifications