Hyderabad: వచ్చే రెండు రోజులు వర్షాలు..
తెలంగాణలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. వివిధ జిల్లాలకు రానున్న రెండు రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
తేలికపాటి నుంచి మోస్తరు వానలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగాం, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, కొత్తగూడెం, మెదక్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఛాన్స్ ఉందని పేర్కొంది.

హైదరాబాద్ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉరుములతో కూడిన ఈదురు గాలులతో కూడిన జల్లులను కూడా పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 10 వరకు నగరంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణం 401.8 మిల్లీమీటర్ల వర్షపాతం 487.6 మిల్లీమీటర్లు నమోదైంది.
అయితే హైదరాబాద్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నగరంలో సాధారణ వర్షపాతం 313 మిల్లీమీటర్లకు వ్యతిరేకంగా 295.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 148.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా బండ్లగూడలో 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా మంగళవారం నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి.












Click it and Unblock the Notifications