టిష్యూకల్చర్ ల్యాబ్ ఏర్పాటు: మంత్రి నిరంజన్ రెడ్డి
మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో కొత్త విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం నాంది పలికింది. ఇప్పటికే హరిత హారంతో దూసుకెళ్తుంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని పలువురు ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇటు రాష్ట్రంలో రూ.4.2 కోట్లతో టిష్యూకల్చర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సమీపంలో టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో ఇది మొదటిదని ఆయన తెలిపారు. విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి అన్నిరకాల మొక్కలు టిష్యూకల్చర్ ద్వారా మేలురకమైన జాతుల ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. అన్ని రకాల మొక్కల ఉత్పత్తికి ప్రాథమిక, మూల ఉత్పత్తిగా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. పరిశోధనా ఫలితాలు వేగంగా రైతులకు అందాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. వచ్చే 9 నెలల లోపు మౌళిక సదుపాయాల ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు.

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేయిస్తామని సంకేతాలు ఇచ్చారు. వ్యవసాయరంగంలో సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెంచుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. టిష్యూకల్చర్ మొక్కలకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతుందని వివరించారు. భవిష్యత్ లో ఇక్కడి నుంచే హరితహారం మొక్కలను అందిస్తామని చెప్పారు. ఏటా వర్షకాలంలో హరితహారం మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే.
గంధం, టేకు మొక్కలు అటవీశాఖ ద్వారా రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. సాంప్రదాయ మొక్కలతో పోలిస్తే టిష్యూకల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవే కాకుండా వేగంగా పెరగడంతోపాటు నాణ్యంగా ఉంటాయని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యాధుల బారిన పడకపోగా మంచి దిగుబడిని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.