ఆ తప్పిదాలతో గుణపాఠం నెర్వలే: ఇంటర్ ఫలితాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై వివాదం రాజుకుంది. ఎక్కువ మంది ఫెయిల్ కావడం.. ఒకరిద్దరూ విద్యార్థులు సూసైడ్ కూడా చేసుకున్నారు. దీంతో అగ్గిరాజుకుంది. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. పరీక్ష ఫలితాల కారణంగా మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల కాగా, అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు.

అప్పుడు 23 మంది..
2019లో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని అందులో రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వైఖరి వల్లే విద్యా కుసుమలు అర్థాంతరంగా తనువు చాలించారని గుర్తుచేశారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని మండిపడ్డారు. తాజా ఫలితాలో ఆ విషయం మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నెలకొందని తెలిపారు.ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిలయిన సంగి తెలిసిందే. దాంతో పలువురు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఇప్పుడు ఇద్దరు
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. విద్యార్థులు కలత చెందుతున్నారు. కొందరు అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎప్పటి లాగే ఈ సారి ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్ తమ ప్రాణాలను తీసుకున్నారు.

మార్కుల ఒత్తిడి
పిల్లలపై మార్కుల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా నలుగురిలో పరువు పోతుందనో, స్నేహితులు హేళన చేస్తారనో, తల్లిదండ్రులు తిడతారనో.. ఇలాంటి భయాలతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ సారి ఇంటర్ ఫలితాల్లో కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదవ్వడం కూడా వివాదస్పదమైంది. ఇంటర్ బోర్డు కఠిన వైఖరి వల్లే ఈ దుస్థితి వచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి..












Click it and Unblock the Notifications