హైదరాబాద్‌లో అంధకారం - కరెంటు ఉన్నా ఇవ్వలేమన్న ట్రాన్స్‌కో - వరద తగ్గేదాకా ఇంతేనా?
రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ సిటీలో చీకట్లు అలముకున్నాయి. గ్రేటర్ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అవిశ్రాంతంగా పనిచేస్తోన్న విద్యుత్ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరాను పునరుద్ధరించినా, బుధవారం రాత్రి వరకు చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాలు, అక్కడి నుంచి విద్యుత్ సరఫరా అయ్యే ఏరియాలు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్దరణపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారీగా ఫిర్యాదులు..
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మూసీ నది ఉప్పొంగింది. లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. పదుల కొద్దీ విద్యుత్ సబ్ స్టేషన్లు నీట మునిగాయి. 200కుపైగా ట్రాన్స్ ఫార్మర్లు మూసీ వరదలో కొట్టుకుపోయాయి. చాలా చోట్ల చెట్లు విరిగి విద్యుత్తు లైన్లపై పడ్డాయి. దీంతో సిటీలోని సగానికి పైగా ఫీడర్లలో సరఫరాను నిలిపేసిన అధికారులు.. బుధవారం సాయంత్రానికి అతి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పునరుద్ధరణ చేయగలిగారు. 24 గంటలకుపైగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ శాఖకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి.

కరెంటు ఉన్నా ఇవ్వలేక..
హైదరాబాద్ లో కోతలకు కారణం కరెంటు లేక కాదని, విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కరెంటు ఇవ్వలేకపోతున్నామని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. చాలా సబ్ స్టేషన్లు ఇంకా వరద నీటిలోనే ఉండటం, సిటీలోని చాలా అపార్ట్మెంట్లోకి వరద నీరు రావడం వల్లే సరఫరా నిలిపేశామని, వరద తగ్గుముఖం పడితేగానీ విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాదని ఆయన చెప్పారు. మూసి నది ప్రవాహంలో 200 ట్రాన్స్ఫార్మర్స్ లో కొట్టుకుపోయాయని, దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో సరఫరాను నిలిపేశామని చెప్పారు.

కుప్పకూలిన విద్యుత్ డిమాండ్
భారీ వర్షాలు, వరదలకు సబ్ స్టేషన్లు నీట మునగడంతో మంగళ, బుధవారాల్లో విద్యుత్ డిమాండ్ కుప్పకూలింది. విద్యుత్ డిమాండ్ ఏకంగా 2974 మెగావాట్లకు పడిపోయింది. గతేడాది ఇదే రోజున విద్యుత్ డిమాండ్ 6807 మెగావాట్లుగా ఉంది. డిమాండ్ అకస్మాత్తుగా పడిపోవడంతో గ్రిడ్ కుప్పకూలకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి, సరఫరాను మెరుగుపర్చామని, ముంబై తరహాలో గ్రిడ్ కుప్పకూలకుండా అప్రమత్తమయ్యామని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ పడిపోవడం ఇదే తొలిసారని, ప్రస్తుతానికి గ్రిడ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications