కేసీఆర్‌పై వీహెచ్ నిప్పులు.. సంకెళ్లు వేయించిన ఘనత మీదే.. కేంద్రానికి రంజిత్ విజ్ఞప్తి
వరి పంట కొనుగోలు చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. ఇంతలో కాంగ్రెస్ కూడా ఆడపా దడపా స్పందిస్తోంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. కేసీఆర్‌పై సీనియర్ నేత వీహెచ్ విరుచుకుపడ్డారు. రైతులకు సంకేళ్లు వేయించిన ఘనత దేశంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరను కోరే హక్కు రైతుకు ఉందని, దానికోసమే నిరసన తెలిపిన రైతులను జైలుకు పంపిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.
రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని వీహెచ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని వీహెచ్ ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని విస్మరించారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, దొంగనాటకం ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకరిపై ఒకరు నెడుతూ రైతులతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. రైతులకు టీఆర్‌ఎస్ మోసాలను పార్లమెంట్‌లో నిలదీస్తామని హనుమంతరావు తెలిపారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడారు. 377 నిబంధన ప్రకారం తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం, బియ్యం కొనుగోలు విషయమై స్పష్టత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఫార్మర్ ఫ్రెండ్లీ పరిపాలన చేస్తున్నారని గుర్తుచేశారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు పంటల పెట్టుబడి కింద రైతు బంధు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉన్నాయన్నారు. ఏడాదికి ఏడాది రాష్ట్రంలో పంటలు అధికంగా పండుతున్నాయని, దిగుబడులు పెరుగుతున్నాయని తెలిపారు.
ప్రతి ఏడాది ఎఫ్ సి ఐ కొనుగోలు చేసే బియ్యం లక్ష్యాన్ని ఒకేసారి నిర్ణయించే విధంగా ఆదేశించాలని ప్రధానిని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. ప్రతి ఏటా పెరుగుతున్న దిగుబడులను అనుసరించి, ఎఫ్ సి ఐ కొనుగోలును కూడా పెంచాలని కోరారు. ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం సహకారంగా ఉండాలని, ఆ విధంగా ఎఫ్ సి ఐని ఆదేశించాలని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు.












Click it and Unblock the Notifications