టీఎస్‌పీఎస్సీ లీక్ కేసు: ప్రవీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేసిన మరో నలుగురి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, టీఎస్‌పీఎస్‌సీ ఏఈఈ పేపర్ కూడా లీక్ కావడంతో.. ఈ కేసులో సిట్ మరో నలుగురిని అరెస్టు చేసింది. ఈ నలుగురు ప్రధాన నిందితుడు ప్రవీణ్ దగ్గర ఏఈఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. వీరితో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 27కి చేరింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మే 8వ తేదీ సోమవారం కూడా ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్ కొనుగోలు చేసిన ముగ్గురిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ నుంచి ఈ ముగ్గురు పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మనోజ్, మురళీధర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని సిట్ అరెస్ట్ చేసింది. ఏఈఈ ప్రశ్నపత్రాన్ని రూ.10 లక్షలకు ప్రవీణ్ విక్రయించారని సిట్ బృందం గుర్తించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం 15 వరకు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్ 4కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 8180 గ్రూప్-4 పోటీస్లుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 30 నుంచి ఈ ఏడాది జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఈ క్రమంలో గ్రూప్-4 పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తాజాగా, టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.
మే 9వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు మరోసారి అవకాశం ఉండదని.. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది.
కాగా, మొత్తం 8180 గ్రూప్-4 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ నెలకొనడంతో స్థానికతతోపాటు విద్యార్హతలు, కుల ధృవీకరణ వంటి పలు అంశాలు నియామక ప్రక్రియలో కీలకం కానున్నాయి. అందువల్ల దరఖాస్తు సమయంలో దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు తాజాగా టీఎస్ పీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఇక, తెలంగాణ గ్రూప్-4 పరీక్ష జులై 1న జరగనుంది.












Click it and Unblock the Notifications