డెలివరీ చేస్తూ శిశువు తల లాగిపారేసిన డాక్టర్లు.. అచ్చంపేట ఘటనలో షాకింగ్ నిజాలు.. ఇద్దరి సస్పెన్షన్
పురుడుపోయడం ద్వారా తల్లీబిడ్డలకు కొత్త జన్మనిస్తారు కాబట్టే డాక్టర్లను దేవుళ్లుగా జనం కీర్తిస్తారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు మాత్రం దెయ్యాల్లాగా గర్భం నుంచి బయటికొస్తున్న శిశువు తలను అమాంతం పీకిపారేసి.. తెగిపోయిన మొండేన్ని మళ్లీ తల్లి కడుపులోకి నెట్టేసి.. ఆపై తమకే సంబంధం లేనట్లు కలరింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి..

తల బయటికి రాగానే లాగేశారు..
అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డ్యూటీ డాక్టర్ ఉషారాణిలు శుక్రవారం ఉదయం స్వాతి అనే గర్భిణికి డెలివరీ చేసేప్రయత్నం చేశారు. తల్లికి ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే.. గర్భం నుంచి శిశువు బయటికి రావడం మొదలైంది. సాధారణంగా ఈ ప్రక్రియను డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. కానీ ఈ ఇద్దరు డాక్టర్లు మాత్రం సోయిలేకుండా వ్యవహరించారు. శిశువు తలను పట్టుకుని గట్టిగా లాగేయడంతో తల.. మొండెం నుంచి వేరైపోయింది. మిగిలిపోయిన మొండేన్ని తల్లి కడుపులోకి వెనక్కి తోసేసి.. తలను ఎవరికీ కనపడకుండా దాచేశారు. ఆపరేషన్ తమ వల్ల కాదని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులకు చెప్పి పంపించేశారు.

పెద్ద ప్రాణాన్ని బతికించమని బతిమిలాడినా వినిపించుకోలేదు
గర్భిణి స్వాతిని హైదరాబాద్ లోని పేట్ల బురుజు ఆస్పత్రికి తరలించడానికి ముందు అచ్చంపేట ఆస్పత్రిలో హైడ్రామా జరిగినట్లు ఆమె బంధువులు చెప్పారు. దుస్తుల నిండా రక్తం మరకలతో డాక్టర్లు, నర్సులు అటు ఇటు తిరగడం చూసి, అనుమానంతో ఏమైందని అడగ్గా.. ఐదు రోజుల కిందటే శిశువు చనిపోయిందని ఒకసారి, ఆపరేషన్ చేయలేమని ఇంకోసారి పొంతనలేని సమాధాలు చెప్పినట్లు స్వాతి తల్లి, అత్తలు మీడియాకు చెప్పారు. కడుపులో బిడ్డ పోతేపోయింది, తల్లినైనా కాపాడండి సార్.. అని బతిమిలాడినా వినిపించుకోలేదని తెలిపారు.

హెల్త్ కమిషనర్ ఎంక్వైరీ.. ఇద్దరిపై వేటు
అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి ఘటన సంచలనం రేపిన నేపథ్యంలో హెల్త్ కమిషనర్ శనివారం ఉదయమే అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేపట్టారు. డ్యూటీలో తీవ్ర తప్పిదం చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిలను అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. వాళ్లు దాచి ఉంచిన శిశువు తలను ఉన్నతాధికారులకు అప్పగించారు. దానికి వేరే డాక్టర్లు పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఇటు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వాతి ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
ఇలాంటి దారుణ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు ఇంకా స్పందించాల్సిఉంది.