భూములుంటే అమ్ముతారా.. సర్కార్‌పై విజయశాంతి ఆగ్రహాం
రాష్ట్రంలో భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి చావు దెబ్బ తగిలిందని బీజేపీ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి అన్నారు. భూముల వేలంపై తాజా హైకోర్టు స్పందనను ప్రస్తావిస్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. భూములను రక్షిస్తామని చెప్తూనే.. కబ్జాలకు గురవుతున్న కారణంగా భూములను వేలానికి పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, ఈ ద్వంద నీతి ఏంటని ప్రశ్నించారు.

చావుదెబ్బ
భూముల వేలంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో చావుదెబ్బ తగిలిందని విజయశాంతి గుర్తుచేశారు. వేలం సంగతి అలా ఉంచి... ఉన్న భూమిని ఎలా కాపాడతారో చెప్పండంటూ న్యాయస్థానం నిలదీసింది. ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పులకుప్పగా మార్చిన పాలకులు... ఇప్పుడు ఆ అప్పుల తిప్పల నుంచి బయటపడేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్ని వేలంలో తెగనమ్మేందుకు సిద్ధపడి... భవిష్యత్తులో భావితరాల కోసం ప్రభుత్వం తరఫున ఏ చిన్న నిర్మాణం చెయ్యాలన్నా సర్కారు భూమి కోసం దిక్కులు చూసే పరిస్థితి తీసుకొస్తున్నారు.

ఆదాయం రాగా
కోకాపేట భూముల వేలంతో వచ్చిన ఆదాయాన్ని చూసుకుని వెర్రెత్తిపోయి... మరింత దూకుడుగా భూముల వేలంతో ముందుకెళ్ళాలనుకున్న సర్కారుకు వివాదాలు, కేసులు వెల్‌కం చెప్పడంతో పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలానికి బ్రేక్ పడింది. అసలు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నందువల్లే వేలం వేస్తున్నట్టు చెప్పుకున్న తెలంగాణ పాలకులు... ఇంకోపక్క రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటోంది. మరి ఈ ల్యాండ్ బ్యాంక్ భూములు మాత్రం కబ్జాలకు గురికాకుండా ఎలా రక్షిస్తారనే ప్రశ్నకు జవాబివ్వలేకపోవడం ప్రభుత్వ చేతగానితనం తప్ప మరొకటి కాదు.

విస్మయం
జూలైలో పిటిషన్ వేసినప్పుడే.... ప్రభుత్వమే భూములను కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. కనీసం అప్పుడైనా మేలుకోవలసిన సర్కారు మరికాస్త మత్తులోకి జారుకుంది. తాజాగా... అసలు ప్రభుత్వ భూములను ఎలా రక్షిస్తారో 4 వారాల్లో వివరణ ఇవ్వాలని.... వేలం వేసే భూముల వివరాలను కూడా తమకు ఇవ్వాలని న్యాయమూర్తులు సర్కారును ఆదేశించారు. కోకాపేట్, ఖానామెట్ మొదటి దశ వేలాన్ని సర్కారు ఏ విధంగా సమర్ధించుకుంటుందో కూడా తమకు తెలియజేయాలని హైకోర్టు అదేశించింది.
Recommended Video

విత్ డ్రా
పుప్పాలగూడలోని సర్కారీ భూములను వేలం వెయ్యాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వమే తెలియజేసి, వెనక్కి తగ్గి, తోక ముడిచేట్లు మన కొట్లాట ద్వారా చెయ్యగలిగాం. నిజం చెప్పాలంటే తెలంగాణలో సర్కారు భూములకు అసలైన శత్రువు అధికార పార్టీయే... భూములతో పాటు చెరువుల ఆక్రమణల్ని కూడా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నట్టు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులపై కోకొల్లలుగా ఆరోపణలు, బలమైన సాక్ష్యాలు మీడియాలోను... సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా భూముల అమ్మకాన్ని నిలిపేలా ఉత్తర్వులు జారీ చేసి, జీవో 13ను కొట్టివేయాలి. ఇప్పటికీ మొండి వైఖరితో ముందుకెళితే బుద్ధి చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారు'' అని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..












Click it and Unblock the Notifications