తెలంగాణకు చల్లని కబురు: రానున్న నాలుగు రోజులపాటు జోరు వానలు
హైదరాబాద్: విపరీతమైన ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. అక్కడక్కడ చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత కూడా పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరం చల్లబడింది.

అంతేకాకుండా ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో ఎండల నుంచి కొంచెం ఉపశమనం కలిగించినట్లయింది. ప్రజలకు ఎండల నుంచి ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. రైతులకు మాత్రం వేదననే మిగుల్చుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు కురిసన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఇప్పుడు మరోసారి వర్షాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
అయితే, శనివారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఎండతీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. 22 మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీల వరకు అధికంగా నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. ములుగు జిల్లా కన్నాగూడెంలో సాధారణం కన్నా 6.5 డిగ్రీలకుపైగా నమోదుకావడంతో వడగాలులు కూడా తీవ్రంగా ఉన్నాయి.
ఈ ఏడాది ఎక్కువ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. గరిష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 46.4 డిగ్రీలు నమోదైంది. కుమురంభీం సిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, ములుగు జిల్లా తాడ్వాయి, భద్రాద్రి జిల్లా సీతారాంపురం, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో 46 డిగ్రీలకుపైగా నమోదైంది. సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లోని నేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications