మూడో వేవ్ ముంచుకొస్తోంది.. చర్యలేవీ, కేంద్ర, రాష్ట్రాలపై హైకోర్టు ఆగ్రహాం
కరోనా థర్డ్ వేవ్ భయాందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ లేదాంటే అక్టోబర్‌లో మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. అయితే మూడోవేవ్ ముంచుకొస్తోందని, ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా మూడోవేవ్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు కోర్టుకు నివేదిక సమర్పించారు.
ప్రభుత్వ స్పందనపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని కామెంట్ చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ సోకి చాలా మంది చనిపోయారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా నష్టం జరగకుండా చూడాలని సూచించింది. చాలా రాష్ట్రాల్లో మూడో వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, అక్కడ కేసులు పెరిగిపోతున్నాయని గుర్తు చేసింది.

ఆదేశించినా ఇంతవరకు నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించలేదని, వారంలోగా కమిటీ భేటీ అయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించింది. జనగామ, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండలో కేసుల పాజిటివిటీ రేటు ఒక శాతం కన్నా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరింది. తమ ఈ ఆదేశాలనైనా అమలు చేయాలని, లేదంటే కోర్టుకు రావాల్సి ఉంటుందని డీహెచ్, కేంద్ర నోడల్ అధికారిని హెచ్చరించింది.
మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications