మల్లారెడ్డి తర్వాత ఐటీ దాడులు వారిపైనే..?
తెలంగాణ రాష్ట్ర సమితికి ఆర్థికంగా ఒక మూల స్తంభంగా ఉన్న మల్లారెడ్డిపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరుగుతున్నాయి. 200 మందికిపైగా ఉద్యోగులు 50 బృందాలుగా ఏర్పడి కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపార సంస్థలన్నింటిపై దాడిచేశారు. వివరాలన్నీ సేకరించేందుకు కొందరు అధికారులు కొన్ని నెలల నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా అవతారం ఎత్తి సమాచారాన్ని సేకరించుకొని దాడికి దిగారు. వ్యాపార లావాదేవీలున్నీ ఒక చిన్న సహకార బ్యాంక్ ద్వారా జరుపుతారని నిర్థారించుకున్నారు.

ఎవరిది పైచేయి అవుతుంది?
రాజకీయంగా టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరిది పై చేయిగా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి తర్వాత ఎవరు? అనేప్రశ్న పార్టీ వర్గాల్లో వినపడుతోంది. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆర్థిక స్తంభాలపై ఎలా అయితే దాడులు జరిగాయో అలాగే జరుగుతున్నాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక స్తంభాలుగా ఉన్నవారందరూ టార్గెట్ అయ్యారని భావిస్తున్నారు.

కాళేశ్వరంపై దృష్టి?
మెగా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణతోపాటు ఏపీలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి కూడా ఫిర్యాదులు అందాయి. షర్మిల ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ, ఈడీతోపాటు ఇతర అన్ని విభాగాల దృష్టి కాళేశ్వరంపై పడింది.

దాడులను ఎదుర్కోవడానికి మరో 15 మంది సిద్ధం?
ఇటీవల టీఆర్ఎస్ కొంతమందికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. వారిలో ముగ్గురిపై ఐటీ నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, బెంగళూరుల్లో వ్యాపారాలు నిర్వహిస్తోన్న 8 మంది ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చట్టం తనపని తాను చేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనం కోసమే ఈ దాడులని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతే కాకుండా పార్టీలో కీలక స్థాయిలో ఉన్న మరో 15 మంది నేతలు తమపై దాడులకు దిగే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications