వరి వేయకుంటే చింతచెట్లకు, మర్రిచెట్లకు ఉరి వేసుకోవడమే: వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఆమెకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రైతులు, మహిళలలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా సమస్యలు లేని గ్రామాలు లేవు. శుక్రవారం సాయంత్రం 4.30 నిమిషాలకు మంచాల గ్రామంలో షర్మిల మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అంటున్నారని షర్మిల అన్నారు. రైతులు ఉరి వేసుకుంటే అప్పుడు కేసీఆర్ కళ్లు చల్ల బడతాయేమో...వరి ధాన్యం కొనుగోలు చేస్తారో.? లేదో..? తెలియని పరిస్థితి తెలంగాణ రైతాంగం ఉందన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేది. ఉచితంగా కరెంటును అందించి వ్యవసాయాన్ని వైఎస్ఆర్ పండుగ చేశారు. ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం బిడ్డలకు ఉన్నా కూడా పింఛన్ తల్లిదండ్రులకు రావడం లేదన్నారు. పింఛన్ వస్తున్న వ్యక్తి చనిపోతే కూడా ఇంట్లో ఉన్న మరొకరికి పింఛన్ రావడం లేదని చెప్పారు.

అనారోగ్య శ్రీ
పేదలకు ఉచిత వైద్యం కోసం ఆరోగ్య శ్రీని వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆరోగ్యశ్రీని ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యశ్రీగా మార్చేశారని విమర్శించారు. అయిదేళ్లలో వైఎస్ ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు. అంత గొప్ప పాలన అదీ అని చెప్పారు. పావలా వడ్డీ రుణాలతో మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. ఇప్పుడు వడ్డీ రూపాయి పావలా పడుతోంది. ఆ రుణాలను ఇంటి ఖర్చులకే వాడుతున్నారని మహిళలు చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. సమాజం ముందు నిరుద్యోగులు తలెత్తుకొని తిరగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్‌లో చలనమే లేదన్నారు. టీ సెంటర్లు, కూరగాయలు అమ్ముకుని నిరుద్యోగులు బతికే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉంది. హమాలీ పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని మంత్రులే నిరుద్యోగులకు చెబుతున్నారు. ఇప్పటి వరకు తిరిగిన గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు పీజీలు చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

5 కొలువులు
కూలీ నాలీ చేసుకుని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని చదివిపిస్తే ఇలా వారు ఇబ్బందులు పడుతుంటే చూడాలా..? కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదు ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పోలీసుల నియామకాలు చేసి వారిని ఇంటికి కాపలాగా ఉండేందుకు పెట్టుకున్నాడు. కేసీఆర్ ఇంట్లో పనివారిలా పోలీసులను వాడుకుంటున్నాడు. ఉద్యమకారుడు కదా పాలన ఉద్యమకారుడి చేతిలో పెడితే ఉద్దరిస్తాడనుకుంటే నట్టేట్లో ముంచేశాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వటం కాదుకదా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. తెలంగాణలో 30 వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు పోయి రోడ్డునపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పాడు. ఒక్కరికైనా ఇళ్లు, పింఛన్ వచ్చిందా..? కేజీ టు పీజీ ఉచిత విద్య ద్వారా ఎంత మంది తల్లిదండ్రుల పిల్లలు చదువుకుంటున్నారు. ఇలా ప్రజలను మోసం చేసి కేసీఆర్ పాలన సాగిస్తున్నాడు.
Recommended Video

పేదల ఇబ్బందులు
గ్యాస్, కరెంట్, పెట్రోల్, డిజిల్, కూరగాయలు ఇలా అన్నీ కలిపి పేదవాడిని బతకకుండా చేస్తున్నాయి. వైఎస్ హయాంలో గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే అవి నా అక్క చెల్లెళ్ల మీద పడవద్దని ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై వేసుకున్నాడు. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు భారాన్ని భరిస్తుందా..? ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకుంటే ప్రజలపై పడుతున్న భారం తగ్గుతుంది. పేదింటి పిల్లల గొప్ప చదువుల కోసం ఫీజు రియాంబర్స్ మెంట్ ను వైయస్ఆర్ గారు ప్రవేశపెట్టారు. కానీ పేదింటి పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రియాంబర్స్ మెంట్ ఇప్పుడు ఎవరికీ అందడం లేదు. ఫీజు రియాంబర్స్ మెంట్ పేరుతో 35000 రూపాయలు మాత్రమే ఇస్తు మిగిలిన డబ్బు అంతా తల్లిదండ్రుల చేతనే కట్టిస్తున్నారు. కట్టని వారికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో బస్సులు కూడా రాని పరిస్థితి ఉంది. ప్రజలకు మేలు చేసేందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టానని చెప్పారు.












Click it and Unblock the Notifications