India vs Pakistan T20 World Cup 2021: పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా మొనగాడు
అబుధాబి: ఎప్పుడెప్పుడా అంటూ క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచ కప్ అసలు సిసలు పోరాటానికి తెర లేవనుంది. తన ప్రపంచకప్ టోర్నమెంట్ జైత్రయాత్రను భారత్ క్రికెట్ జట్టు- చిరకాల ప్రత్యర్థితో ఆరంభించబోతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. తన మొట్టమొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక అయింది. భారత కాలమానం ప్రకారం- ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఇన్నింగ్ మొదలవుతుంది.

మ్యాచ్‌కు మించిన ఎమోషన్స్..
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటే.. అది మ్యాచ్ వరకు మాత్రమే పరిమితం కాదనేది రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులకు తెలుసు. అంతకుమించి- అనే స్థాయిలో ఉంటుంది. కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుందీ మ్యాచ్. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ద్వైపాక్షిక సంబంధాల్లో తెగదెంపులు, జమ్మూ కాశ్మీర్ అంశం, అక్కడ చోటు చేసుకుంటోన్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ రెండు దేశాలకు చెందిన జాతీయ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం అనేది చాలా అరుదు.

ఐసీసీ టోర్నమెంట్లలోనే..
ఇతర జట్ల తరహాలో అటు పాకిస్తాన్ గానీ, ఇటు టీమిండియా గానీ.. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదు. ఒక దేశం మరో దేశ పర్యటనకూ వెళ్లట్లేదు. సుదీర్ఘకాలంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న క్రీడా సంబంధాలు కూడా అంతంత మాత్రమే. క్రికెట్ ఆడాల్సి వస్తే.. అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లల్లో మాత్రమే సాధ్యపడుతోంది. అది కూడా తటస్థ వేదికల మీదే. అంతే తప్ప భారత జట్టు పాకిస్తాన్‌కు గానీ, పాక్ జట్టు భారత పర్యటనకు గానీ రావడం నిలిచిపోయి చాలా సంవత్సరాలవుతోంది.

గెలుపు భారత్‌వైపే..
ఇదివరకు ఆసియాకప్, ఆ తరువాత ప్రపంచకప్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్.. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండే అంశం. ప్రత్యర్థిని ఓడించాలనే పట్టుదల రెండు జట్లలోనూ కనిపిస్తుంటుంది. అలాంటి అన్ని సందర్భాల్లోనూ విజయం.. భారత్‌ను వరించింది.

భారత్‌ను ఓడించని పాక్
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో గానీ, టీ20 వరల్డ్ కప్‌లో గానీ పాకిస్తాన్ జట్టు ఒక్కసారిగా కూడా టీమిండియాను ఓడించలేదు. 2019లో ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నమెంట్‌లోనూ భారత్ చేతిలో పాకిస్తాన్ మట్టి కరిచింది. ఈ సారి ఆ ఆనవాయితీకి బ్రేక్ వేయాలనే పట్టుదలతో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్ మ్యాచ్ కోసం సన్నాహాలు చేస్తోండగా.. తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో టీమిండియా సన్నద్ధమౌతోంది.

2019 తరువాత తొలిసారిగా..
2019లో ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత మళ్లీ భారత్- పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. రెండు సంవత్సరాల విరామం అనంతరం ఈ రెండు జట్లు తలపడబోతోన్నాయి. అది కూడా ఐసీసీ నిర్వహిస్తోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమౌతుంది. 2019 నాటి వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే చరిత్ర రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

టీ20ల్లో పాక్‌పై అత్యధిక రికార్డులు చేసిన క్రికెటర్‌గా..
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం అనేది అరుదు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే పాకిస్తాన్‌తో నామమాత్రంగా క్రికెటను ఆడుతోంది టీమిండియా. అందుకే- ఈ రెండు దేశాల క్రికెటర్ల రికార్డులు కూడా భారీగా ఉండట్లేదు. 50 ఓవర్ల మ్యాచ్‌లను మినహాయించి.. టీ20 వరకు ఉన్న స్టాటిస్టిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. పాకిస్తాన్‌పై అత్యధిక పరుగులను నమోదు చేసిన టీమిండియా క్రికెటర్లు అయిదుమంది ఉన్నారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, యువరాజ్ సిం్, రాబిన్ ఉతప్ప మాత్రమే 50కి మించి పరుగులు చేశారు.

టాపర్‌గా విరాట్ కోహ్లీ..
ఈ అయిదుమందిలోనూ విరాట్ కోహ్లీది హయ్యెస్ట్ స్కోర్. పాకిస్తాన్‌పై టాప్ స్కోరర్ అతనే. ఇప్పటిదాకా 169 పరుగులు చేశాడతను. గౌతమ్ గంభీర్-75, రోహిత్ శర్మ-64, యువరాజ్ సింగ్-59, రాబిన్ ఊతప్ప-58 పరుగులు చేశారు. ఈ అయిదుమందిలో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప టీమిండియాలో లేరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతున్నారు. ఈ ఆదివారం జరిగే మ్యాచ్‌లో వారిద్దరూ ఆడాల్సి ఉంది. నిజానికి- 50 ఓవర్ల మ్యాచ్‌లో రోహిత్ శర్మది హయ్యెస్ట్ స్కోర్. టీ20ల్లో అతను రెండోస్థానంలో ఉన్నాడు.

ఇప్పటిదాకా అయిదు మ్యాచులే..
భారత్- పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా జరిగింది.. అయిదు టీ20 మ్యాచులే. ఇందులో నాలుగింట్లో టీమిండియా విజయఢంకా మోగించింది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. పాకిస్తాన్ ఒక్కసారి కూడా గెలవలేదు. భారత్ అత్యధికంగా 157 పరుగులను చేసింది. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదించలేకపోయింది. 152 పరుగులే చేయగలిగింది. భారత్‌పై పాకిస్తాన్ అత్యధిక స్కోరు 152 పరుగులే. పాకిస్తాన్‌పై భారత్ చేసిన హయ్యెస్ట్ స్కోర్ 157 రన్స్. పాకిస్తాన్‌పై టీమిండియా నమోదు చేసిన లోయెస్ట్ స్కోర్.. 119 పరుగులు. పాకిస్తాన్ చేసిన లోయెస్ట్ స్కోర్ 118. 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది పాకిస్తాన్.