దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు- 1.73 లక్షలే-45 రోజుల కనిష్టానికి
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మరికాస్త తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది. దీంతో రోజువారీ కేశుల సంఖ్య మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. గత 24 గంటల్లో కేవలం 1.73 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత 45 రోజుల కనిష్టం కావడం మరో విశేషం. ఈ నెల ఆరంభంలో రోజుకు 4 లక్షల పైచికులు కొత్త కేసులు నమోదవుతుండగా.. తాజాగా ఈ సంఖ్య మూడొంతులు తగ్గిపోవడం భారీ ఊరటనిస్తోంది.

నెమ్మదిస్తున్న కరోనా
భారత్‌లో సెకండ్ వేవ్ పేరుతో తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ ఇప్పుడు క్రమంగా నెమ్మదిస్తోంది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీగా కేసులు తగ్గుతున్నాయి. లాక్‌డౌన్‌ల ప్రభావం ఓవైపు, వ్యాక్సినేషన్ మరోవైపు కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. దీంతో తాజాగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించిన హెల్త్ బులిటెన్‌లో కేవలం 1.73 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.

పెరుగుతున్న రికవరీలు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యతో పోలిస్తే రికవరీలు భారీగా ఉంటున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 2.84 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా 3617 మంది కరోనాతో చనిపోయారు. వరుసగా రెండో రోజు కరోనా కేసులు తక్కువగా నమోదు కాగా.. మరణాలు మాత్రం వరుసగా మూడో రోజు 4000 కంటే తక్కువగా నమోదయ్యాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర కొత్త కేసుల జాబితాలో టాప్‌లో ఉన్నాయి. మరణాల్లోనూ మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక టాప్‌లో ఉన్నాయి.

పది శాతానికి దిగువన పాజిటివిటీ
దేశవ్యాప్తంగా ఈ నెల ఆరంభంలో 20 శాతానికి చేరువైన కరోనా పాజిటివిటీ శాతం ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. వివిధ రాష్టాల్లో తగ్గుతున్న కేసులతో పాటే పాజిటివిటీ కూడా తగ్గడంతో ప్రభుత్వాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే పది శాతం కన్నా తక్కువ పాజిటివిటీ నమోదవుతోంది. పాజిటివిటీ రేటు 20 శాతం దాటితే లాక్‌డౌన్ విధించాలని నిపుణులు చెప్తుండగా.. దాదాపు మూడొంతులు రాష్టాల్లో పది శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు నమోదవుతుండటం ఊరటనిస్తోంది.

డిసెంబర్ కల్లా 108 కోట్ల మందికి వ్యాక్సిన్
మరోవైపు కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 108 కోట్ల మందికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌తో పాటు ఫైజర్, మోడర్నా వంటి వ్యాక్సిన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటి ఉత్పత్తిని కూడా్ భారీగా పెంచడం ద్వారా డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 108 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది.












Click it and Unblock the Notifications