వైమానిక దళం మరింత పటిష్టం: మరిన్ని రాఫెల్ జెట్ ఫైటర్లు: త్వరలో ఎంట్రీ
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేనను శతృదుర్భేద్యంగా మార్చాయి. సరిహద్దుల్లో గగనతల నిఘా పటిష్టమైంది. డేగ కళ్లతో పహారా కాస్తోంది వైమానిక దళం. తాజాగా మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. నెలరోజుల వ్యవధిలో దశలవారీగా 10 రాఫెల్ జెట్ ఫైటర్లు వాయుసేనలో చేరబోతోన్నాయి. వాటి రాకతో గగనతల నిఘా మరింత పకడ్బందీగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
అత్యాధునికమైన రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలిదశలో అయిదు యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చాయి. హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్‌లో గల వైమానిక దళం ఎయిర్ బేస్ స్టేషన్‌లో దిగాయి. రెండో విడతలో మరో 10 జెట్ ఫైటర్లు భారత్‌కు రానున్నాయి. ఏప్రిల్ వాటి రాక ఆరంభమౌతుందని వైమానిదళాధికారులు చెబుతున్నారు. ఈ విడతలో మొత్తం 10 విమానాలు భారత్‌కు వస్తాయని, ఆ వెంటనే వాయుసేనలో ఇండక్ట్ అవుతాయని అంటున్నారు.

కొత్త రాఫెల్ జెట్ల రాకతో వాటి సంఖ్య 21కి చేరుతుంది. తొలిదశలో అయిదు, మలి దశలో ఆరు ఫైటర్లు అంబాలా ఎయిర్‌బేస్‌లోని 17 స్క్వాడ్రన్‌లో చేరాయి. తాజాగా మరో 10 యుద్ధ విమానాలు అదే స్క్వాడ్రన్‌లో చేరుతాయని తెలుస్తోంది. భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో.. గగనతల నిఘాను మరింత ముమ్మరం చేయడానికి రాఫెల్ జెట్ విమానాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు.
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ మొదలుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల మేర చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న రాష్ట్రాల్లో రాఫెల్ యుద్ధ విమానాలను మోహరింపజేస్తున్నారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూ, ఉద్రిక్త వాతావరణానికి కారణమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాఫెల్ అవసరం ఉందని వైమానిక దళాధికారులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications