అసలేంటీ ఈ బిట్ కాయిన్.. కరెన్సీకి ప్రత్యామ్నాయమా? ఎలా?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Bitcoins : బిట్ కాయిన్ అంటే అదన్నమాట !

  న్యూఢిల్లీ: బిట్ కాయిన్‌.. ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న మాట. అంతేకాదు, ఈ బిట్ కాయిన్ విలువ అమాంతం పైకి పెరుగుతోందనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో బిట్ కాయిన్స్‌ గురించి తెలియ‌క‌పోయినా చాలామంది వాటితో క‌రెన్సీ ట్రేడింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

  ప్ర‌స్తుతం ఒక బిట్ కాయిన్ విలువ 18 వేల అమెరిక‌న్ డాల‌ర్లకు పైనే ఉంది. మార్చి 2010లో బిట్ కాయిన్ విలువ 0.003 డాల‌ర్లుగా ఉండేది. ఇప్పుడు చూస్తే కొన్ని ల‌క్ష‌ల రెట్లు పెరిగిపోయింది. అస‌లు బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఇది ఎలా చలామణీలోకి వచ్చింది?

  బిట్ కాయిన్ .. వర్చువల్ కరెన్సీ...

  బిట్ కాయిన్ .. వర్చువల్ కరెన్సీ...

  ‘బిట్ కాయిన్' అనేది నిజానికి ఏ దేశానికి చెందిన క‌రెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా త‌యారు చేయ‌లేదు. ఇదొక వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ. దీన్నే డిజిట‌ల్ క‌రెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తారు. అంటే.. కేవ‌లం ఇంట‌ర్నెట్‌లోనే ఈ క‌రెన్సీ చెల్లుబాటు అవుతుంద‌న్న‌మాట‌. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే ఉంటుంది కదా (1 బైట్ = 8 బిట్లు), అందుకని ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దీనికి ‘బిట్ కాయిన్' అని పేరు పెట్టారు.

  2008లో ఆవిర్భావం...

  2008లో ఆవిర్భావం...

  ఈ బిట్ కాయిన్ క‌రెన్సీని మొద‌ట 2008లో స‌తోషి న‌క‌మొటొ అనే వ్య‌క్తి అందుబాటులోకి తెచ్చాడు. ఇది ఆ వ్య‌క్తి అస‌లు పేరు కూడా కాదు. ఎవ‌రో గుర్తుతెలియని వ్య‌క్తి స‌తోషి న‌క‌మొటొ పేరిట బిట్ కాయిన్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు. అదే సంవ‌త్స‌రంలో.. అంటే.. ఆగ‌స్టు 18, 2008న బిట్‌ కాయిన్ డాట్ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌ను కూడా అత‌ను ప్రారంభించాడు. ఆ వెబ్‌సైట్ ఇప్ప‌టికీ ర‌న్నింగ్‌లోనే ఉంది.

  2010లో అసలు కరెన్సీతో మార్పిడి...

  2010లో అసలు కరెన్సీతో మార్పిడి...

  నిజానికి ఒకప్పుడు ఈ బిట్ కాయిన్‌కు అస‌లు ఎలాంటి విలువ ఉండేది కాదు. కానీ మార్చి 2010లో ఒక బిట్ కాయిన్ విలువ 0.003 అమెరిక‌న్ డాలర్లుకు చేరింది. ఈ క్ర‌మంలో బిట్ కాయిన్ క‌రెన్సీని మొద‌టిసారిగా మార్చి 2010లో వాస్త‌వ క‌రెన్సీతో ట్రేడింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. దీని సృష్టికర్త స‌తోషి 2010లో బిట్‌కాయిన్ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. అయితే అప్ప‌టికే అందులో ఉన్న కొంతమంది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు బిట్ కాయిన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. అన‌తి కాలంలోనే బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగింది. అన్ని కరెన్సీల‌తో పోలిస్తే బిట్ కాయిన్ విలువ ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే వ‌చ్చింది, కానీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. దీంతో ఇప్పుడు చాలా మంది ఈ బిట్ కాయిన్లపై మదుపు చేసేందుకు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు.

  ఎందుకింత ఆదరణ అంటే...

  ఎందుకింత ఆదరణ అంటే...

  బిట్ కాయిన్ అంటే వర్చువ‌ల్ క‌రెన్సీ అని చెప్పుకున్నాం క‌దా. క‌నుక దీన్ని మ‌న ద‌గ్గ‌ర ఉన్న వాస్తవ క‌రెన్సీతో కొనాల్సి ఉంటుంది. అప్పుడే దీన్ని వాడ‌గ‌లం. అలాగే బిట్ కాయిన్ అనేది పీర్ టు పీర్ ఎల‌క్ట్రానిక్ క్యాష్ సిస్ట‌మ్‌. అంటే అమ్మ‌కందారుకు, కొనుగోలుదారుకు మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తులు ఎవ‌రూ ఉండ‌రు. నేరుగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టే ఈ బిట్ కాయిన్ ప‌ట్ల ఆస‌క్తి పెరిగింది. తొలుత దీనికి ఎక్కువ‌గా ఆన్‌లైన్ గేమింగ్ సైట్ల‌లో వాడేవాళ్లు. ఈ బిట్ కాయిన్ లావాదేవీలు ఎంత పెద్ద ఎత్తున జరిపినా ప్రాసెసింగ్ ఫీజు తక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవ‌లే బిట్‌కాయిన్‌ను కొన్ని దేశాలు అధికారికంగా వాస్త‌వ క‌రెన్సీగా గుర్తించే అవ‌కాశం ఉంద‌నే స‌మాచారం గుప్పుమంది. దీంతో బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగింది.

  లావాదేవీలు అత్యంత గోప్యంగా...

  లావాదేవీలు అత్యంత గోప్యంగా...

  బిట్ కాయిన్ లావాదేవీలు అత్యంత గోప్యంగా జరిగిపోతాయి. ఎవ‌రు ఎవ‌రికి బిట్ కాయిన్ల‌ను పంపుతున్నారో మూడో వ్య‌క్తికి ఆ వివ‌రాలు తెలియ‌వు. మ‌న‌కు బిట్ కాయిన్ల‌ను పంపే అవ‌త‌లి వ్య‌క్తి వివ‌రాలు గోప్యంగా ఉంటాయి. అలాగే మ‌నం ఎవ‌రికైనా బిట్ కాయిన్ల‌ను పంపితే మ‌న వివ‌రాలు అవ‌త‌లి వారికి తెలియ‌వు. బిట్ కాయిన్‌ ఏ దేశానికి చెందిన ప్ర‌భుత్వం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌ల‌ ఆధీనంలో కూడా లేనందున దీని లావాదేవీల‌పై వినియోగ‌దారులకు ఎలాంటి ట్యాక్సులు విధించ‌లేరు. క‌నుక‌నే బిట్ కాయిన్‌కు అంత‌టి ఆద‌ర‌ణ పెరిగింది.

  పూచీకత్తు లేని కరెన్సీ...

  పూచీకత్తు లేని కరెన్సీ...

  వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్‌కు ఎలాంటి పూచీ, హామీ ఉండదు. బిట్ కాయిన్ కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమిది. ఇది వాస్తవంగా మనం వాడే కరెన్సీ కాదు కాబట్టి ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశ చ‌ట్ట‌మూ, ప్ర‌భుత్వమూ ఈ బిట్ కాయిన్‌కు పూచీగా ఉండ‌దు. హామీ ఇవ్వ‌లేదు. సాధార‌ణంగా ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్ విషయానికొచ్చేసరికి ప్రభుత్వాలు బాధ్యత వహించవు.

  లావాదేవీలు ఎలాగంటే...

  లావాదేవీలు ఎలాగంటే...


  బిట్ కాయిన్ల లావాదేవీలకు ప్రత్యేకంగా ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు ఉన్నాయి. వీటిని కొన్నప్పుడు, లేదా వీటిని వాస్తవ కరెన్సీలోకి మార్చుకున్నప్పుడు కొంత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ‌న ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను అవ‌తలి వారికి పంపాల‌న్నా, లేదంటే వారి ద‌గ్గ‌ర ఉన్న బిట్ కాయిన్ల‌ను మ‌నం తీసుకోవాలన్నా అందుకు బిట్ కాయిన్ ‘ప‌బ్లిక్ కీ' ఉప‌యోగ‌ప‌డుతుంది. సాధార‌ణంగా కొత్త‌గా బిట్ కాయిన్ల‌ను కొన్న‌వారికి ‘బిట్ కాయిన్ వాలెట్' ఇస్తారు. దానికి యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఉంటాయి. ఈ రెండింటినీ క‌లిపి ‘ప్రైవేట్ కీ' అంటారు. ప్రైవేట్‌ కీ ఉన్న ఇద్ద‌రు యూజ‌ర్లు త‌మ ‘ప‌బ్లిక్ కీ' ల ద్వారా బిట్ కాయిన్ల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ ప‌బ్లిక్ కీ మొత్తం క‌నిష్టంగా 30కి పైన‌, గ‌రిష్టంగా 130కి లోపు క్యారెక్ట‌ర్లను క‌లిగి ఉంటుంది. ఇది సాధార‌ణంగా 1, 5 లేదా 9 నంబ‌ర్‌తో ప్రారంభ‌మ‌వుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కీలో కూడా దాదాపుగా ఇంతే క్యారెక్ట‌ర్ లిమిట్ ఉంటుంది. ఇవి మొత్తం వివిధ అక్ష‌రాలు, లెట‌ర్లు, సింబ‌ల్స్ కాంబినేష‌న్‌ రూపంలో ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి.

  పూచీక‌త్తుగా... ప‌బ్లిక్ లెడ్జ‌ర్

  పూచీక‌త్తుగా... ప‌బ్లిక్ లెడ్జ‌ర్

  వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్‌కు ఏ దేశమూ, ప్రభుత్వమూ పూచీ ఉండదుకానీ.. పబ్లిక్ లెడ్జర్ అనేది పూచికత్తుగా వ్యవహరిస్తుంది. ప‌బ్లిక్ లెడ్జ‌ర్ అంటే బిట్ కాయిన్ లావాదేవీల‌ను న‌మోదు చేసే రికార్డు అన్న‌మాట‌. ఈ రికార్డులో బిట్‌కాయిన్ లావాదేవీల‌ను న‌మోదు చేస్తారు. బిట్ కాయిన్ లావాదేవీల‌ కోసం ఏర్పాటు చేసిన కంప్యూట‌ర్ సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ ను ఉంచుతారు. ఈ క్ర‌మంలో ప్రతి బిట్ కాయిన్ లావాదేవిని అతి తక్కువ సమయంలోనే పబ్లిక్ లెడ్జర్‌లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. అయితే ఇలా చేసే ప్రాసెసింగ్ ప‌నికి గాను కొత్త‌గా బిట్ కాయిన్‌ల‌ను సృష్టిస్తారు. ఇందుకోసం మైన‌ర్స్ ప‌నిచేస్తారు. వీరు కంప్యూటింగ్ ప‌రిజ్ఞానంతో బిట్ కాయిన్ లావాదేవీల‌ను నిర్దారించి వాటిని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్ని ‘మైనింగ్'గా వ్యవహరిస్తారు.

  స‌ర్వ‌ర్ల‌లో నిరంతర అప్‌డేట్...

  స‌ర్వ‌ర్ల‌లో నిరంతర అప్‌డేట్...

  బిట్ కాయిన్ మైనర్స్‌ తమకంటూ సొంతంగా కంప్యూట‌ర్‌ సర్వర్ల‌ను ఏర్పాటు చేసుకుని బిట్ కాయిన్ సాఫ్ట్ వేర్ ద్వారా మైనింగ్ ప‌నిలో ఉంటారు. వీరు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నారు. వీరు త‌మ‌ సర్వర్లను ఇంటర్నెట్ కు ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా బిట్ కాయిన్ నెట్ వర్క్ ను నిర్మిస్తూ వ‌స్తున్నారు. ఈ నెట్ వర్క్ లో తగిన సామర్థ్యం (సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం, సమయం, ఆసక్తి) ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్ధల మధ్య బిట్ కాయిన్ లలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ ద్వారా దానిని నెట్ వర్క్ లో అప్‌డేట్ చేస్తారు. బిట్ కాయిన్ సర్వర్లు దీనిని వాలిడేట్‌ చేసి పబ్లిక్ లెడ్జర్ లోకి కాపీ చేస్తాయి. లెడ్జర్ లో పోస్ట్ చేసిన వెంటనే ఆ వివ‌రాలు ఇతర సర్వర్లలోకి కూడా కాపీ అవుతాయి. అంటే.. సర్వర్లలో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ అవుతుంటాయి. దీంతో ఒకే స‌ర్వ‌ర్ మీద ఆధార ప‌డ‌కుండా మల్టిపుల్ స‌ర్వ‌ర్ల మీద ప‌నిచేయ‌వ‌చ్చు. పైగా ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మాచారం అంతా భ‌ద్రంగా ఉంటుంది. దాన్ని కోల్పోయే అవ‌కాశం ఉండ‌దు.

  బిట్ కాయిన్ ఉనికికి సాక్ష్యం.. బ్లాక్ చెయిన్‌

  బిట్ కాయిన్ ఉనికికి సాక్ష్యం.. బ్లాక్ చెయిన్‌

  బిట్ కాయిన్ లావాదేవీల్లో మ‌న‌కు వినిపించే మ‌రొక ప‌దం బ్లాక్ చెయిన్‌. బ్లాక్ చెయిన్ అంటే.. ఒక గంటకు సరాసరి ఆరుసార్లు చొప్పున ఆమోదం పొందిన లావాదేవీలను ఒక సముదాయంగా చేసి దాన్ని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేయడం. ఈ స‌ముదాయాన్నే ‘బ్లాక్ చెయిన్' అంటారు. ఈ క్ర‌మంలో ఒక బ్లాక్ చెయిన్ న‌మోదైన వెంట‌నే అన్ని సర్వ‌ర్ల‌లోకి ఇది కాపీ అవుతుంది. దీంతో డూప్లికేట్ లావాదేవీలు నివారించ‌బ‌డ‌తాయి. అలాగే బిట్ కాయిన్ చెలామణీలో ఉందని చెప్పేందుకు కూడా ఏకైక సాక్ష్యం ఈ బ్లాక్ చెయిన్ మాత్రమే. ఇది పబ్లిగ్గా వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది. కనుక దీంట్లో ఎలాంటి మోసం ఉండదని చెబుతారు.

  సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా లోపం ఏర్పడితే...

  సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా లోపం ఏర్పడితే...


  బిట్ కాయిన్ లావాదేవీల స‌మాచారం మొత్తం కంప్యూట‌ర్ స‌ర్వ‌ర్ల‌లో ఉన్న‌ప్ప‌టికీ అది భ‌ద్రంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. హ్యాక‌ర్లు దాడి చేస్తే బిట్ కాయిన్ లావాదేవీలు ప్ర‌శార్థ‌క‌మే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ క‌నుక సాఫ్ట్‌వేర్ ప‌రంగా ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అప్పుడు కూడా బిట్ కాయిన్ వినియోగ‌దారుల‌కు న‌ష్టం వాటిల్లుతుంది. గ‌తంలో కూడా బిట్ కాయిన్ సాఫ్ట్‌వేర్‌కు కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌లు ఏర్పడ్డాయి. దీంతో ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ క్ర‌మంలో డెవ‌ల‌ప‌ర్లు ఈ సాఫ్ట్‌వేర్ వెర్ష‌న్‌ను ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. అలా బిట్ కాయిన్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డింది. అయితే తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బిట్ కాయిన్ సేఫ్టీపై కూడా జ‌నాల్లో ఆస‌క్తి పెరిగింది.

  భౌతిక రూపంలోకి... బిట్ కాయిన్!?

  భౌతిక రూపంలోకి... బిట్ కాయిన్!?

  బిట్ కాయిన్ వ‌చ్చి ఇప్ప‌టికి దాదాపుగా 9 ఏళ్లు అవుతున్నా ఇది ఇంకా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ రూపంలోనే ఉంది. అయితే త్వ‌ర‌లోనే బిట్ కాయిన్ వాస్త‌వ క‌రెన్సీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది. కొన్ని దేశాలు బిట్ కాయిన్‌ను వాస్త‌వ క‌రెన్సీగా గుర్తించే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చేతితో పట్టుకోగల బిట్ కాయిన్‌ల‌ను విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. ఈ కాయిన్ల లోపలి భాగంలో ఇంటర్నెట్‌లో ఉపయోగించగల బిట్ కాయిన్ అడ్రస్ (ప‌బ్లిక్ కీ, ప్రైవేట్ కీ) ఇమిడి ఉంటుంద‌ని తెలిసింది. ఈ భౌతిక కాయిన్‌ల‌ను ఉపయోగించి ఇంటర్నెట్ లో వ‌ర్చువ‌ల్‌ బిట్ కాయిన్ లను సొమ్ము చేసుకోవచ్చు. ఇప్ప‌టికే కాసేసియస్ బిట్ కాయిన్లుగా పిల‌వ‌బ‌డే బిట్ కాయిన్ల‌ను భౌతిక రూపంలో విక్ర‌యిస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్‌, బ్రాస్ కోటింగ్ లు ఉన్న‌వి ల‌భిస్తున్నాయి. ఆయా కోటింగ్‌ల‌ను బ‌ట్టి ఈ కాయిన్ల విలువ‌లు ఉంటాయి.

  జాగ్రత్త.. అంటోన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

  జాగ్రత్త.. అంటోన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

  బిట్‌కాయిన్స్‌పై మోజుతో ట్రేడింగ్‌ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్‌కాయిన్‌ సహా వర్చువల్‌ కరెన్సీలో ట్రేడింగ్‌ చేసే వారు సొంతంగా రిస్క్‌ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్‌కాయిన్‌ ధర కేవలం స్పెక్యులేషన్‌పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని, బిట్ కాయిన్ ట్రేడింగ్‌కు ఇన్వెస్టర్లే బాధ్యులని తేల్చి చెప్పింది. బిట్‌కాయిన్‌, వర్చువల్‌ కరెన్సీల నుంచి వినియోగదారులను కాపాడే పటిష్ట యంత్రాంగం కోసం ఆర్‌బీఐ, సెబీతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Through its network, Bitcoin acts as a payment platform that functions on completely digital currency. The company says it is the first decentralised peer-to-peer payment network that is powered by its users with no central authority or middlemen. In other words, Bitcoin is cash for the internet. "Bitcoin is nothing more than a mobile app or computer programme that provides a personal Bitcoin wallet and allows a user to send and receive bitcoins with them. This is how Bitcoin works for most users," bitcoin.org says. The Bitcoin network has recorded details of all transactions ever made. A transaction's authenticity is ensured through digital signatures. "All users have full control over sending bitcoins from their own addresses… Anyone can process transactions using the computing power of specialised hardware and earn a reward in bitcoins for this service."

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి