100శాతం రైతు రుణ మాఫీ: జేడీఎస్ మేనిఫెస్టో విడుదల, పొత్తుపై తేల్చేసిన కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్న జేడీఎస్ పార్టీ సోమవారం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్నికలకు కేవలం ఐదు రోజులే ఉండగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24గంటల్లోనే రైతు రుణ మాఫీని 100శాతం అమలు చేస్తామని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు కూడా అందిస్తామని జేడీఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. 28పేజీల ఈ మేనిఫెస్టోలో నిరు పేదలకు ఉచిత విద్యుత్, 30కిలోల బియ్యం అందిస్తామని పేర్కొంది.

గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు తమ ప్రభుత్వం పింఛను అందించనున్నట్లు తెలిపింది. డెలివరీకి మూడు నెలల ముందు నుంచి గర్భిణీ స్త్రీలు నెలకు రూ.6వేలు, డెలివరీ తర్వాత మూడు నెలల వరకు చెల్లించనున్నట్లు పేర్కొంది.
తమ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రతి మహిళకు డెమోక్రసీ సపోర్ట్ ఇన్సెంటివ్ కింద రూ.2వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
విద్యుత్ ఉత్పత్తి, స్కిల్ డెవలప్‌మెంట్, కన్నడ అభివృద్ధి, గృహ పథకాలు గురించి జేడీఎస్ తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ స్పోకెన్ కన్నడ, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. విద్యా వ్వవస్థలో సమూల మార్పులు చేస్తామని పేర్కొంది.
తమ మెనిఫెస్టో అమలు చేసే వారితో పొత్తు
ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ సరైన మెజార్టీ రాకుండా హంగ్ వస్తే తమ మెనిఫెస్టోను అమలు చేసే పార్టీతో పొత్తు పెట్టుకుంటామని జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి స్పష్టం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!