కేబుల్ బ్రిడ్జీ విషాదం: బీజేపీ ఎంపీ ఫ్యామిలీలో 12 మంది మృతి, 134కు చేరిక
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జి కూలిన పెను ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వందకుపైగా వ్యక్తులు మరణించడంతో అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాద ఘటనలో ఓ బీజేపీ ఎంపీ కుటుంబంలో ఏకంగా 12 మందిని కోల్పోవడం తీరని విషాదాన్ని నింపింది.

12 మంది బీజేపీ ఎంపీ కుటుంబసభ్యులు మృతి
రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ మోహన్‌బాయ్ కళ్యాణ్ జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు 12 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో తాను తన కుటుంబంలోని 12 మందిని కోల్పోయినట్లు ఎంపీ కుందారియా తెలిపారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. వారంతా తన సోదరి కుటుంబసభ్యులని తెలిపారు.

మృతుల్లో చిన్నారులు, మహిళలే అధికం
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఎంపీ మోహన్ బాయ్ కళ్యాణ్ జీ పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారని చెప్పారు. కాగా, ఘటన స్థలంలోనే పలువురు రాష్ట్ర మంత్రులు ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీతోపాటు గుజరాత్ సీఎం ఎప్పటికప్పుడు ఘటనపై సమీక్షిస్తున్నారు. అనేక మంది మృతి చెందడం తనను తీవ్రంగా వేదనకు గురిచేసిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 134కి చేరిన మృతుల సంఖ్య
కాగా, కేబుల్ బ్రిడ్జీ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే వరకు 134 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సిట్ తో విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా నేతలు స్పందించారు. బాధితులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
140ఏళ్లనాటి కేబుల్ బ్రిడ్జికి ఇటీవలే మరమ్మతులు, కానీ..
కాగా, మోర్బీ నగరంలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ పాలన కాలం నాటిది కావడం గమనార్హం. దీనికి 140 ఏళ్ల చరిత్ర ఉంది(1879, ఫిబ్రవరి 20న ఈ వంతెనను ప్రారంభించడం గమనార్హం). ఆదివారం రాత్రి ఈ కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా కూలడంతో వంతెనపై ఉన్న వందలాది మంది నదిలో పడిపోయారు. సామర్థ్యానికి మించి సందర్శకులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ పెను ప్రమాదం జరిగిందని ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనను వారం రోజుల క్రితమే మరమ్మతులు చేసి.. అక్టోబర్ 26 నుంచి సందర్శకులను అనుమతించారు. తిరిగి ప్రారంభించిన మూడు రోజులకే ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications