అంతుపట్టని తీవ్ర జ్వరంతో ఒక్కరోజులోనే 12 మంది చిన్నారులు మృతి: 7 రోజుల్లో 68 మంది
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులు అంతుచిక్కని జ్వరం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో 12 మంది చిన్నారులు ఈ జ్వరం బారినపడి మృతి చెందారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తీవ్రమైన వైరల్ ఫీవర్ బారినపడి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 40 మంది చిన్నారులున్నారు.
ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం, డీహైడ్రేషన్ ఏర్పడటంతోపాటు ప్లేట్‌లెట్ల అమాంతం పడిపోవడం ఈ జ్వరం లక్షణాలుగా ఉంటున్నాయి. పలువురు డెంగ్యూ లక్షణాలతో చికిత్స పొందుతూ మరణించారు. గత పది రోజులుగా ఈ జ్వరం బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లడ్ బ్యాంకుల చుట్టూ తమవారి కోసం జనం తిరుగుతున్నారు.

ఆగ్రా, మథుర, మెయిన్‌పురి, ఈటా, కస్గంజ్ జిల్లాల్లో ఈ జ్వరం బారినపడిన బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఇక ఫిరోజాబాద్ జిల్లాలో మరింత అధ్వాన్నంగా పరిస్థితులున్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతుండటం గమనార్హం. ఇక ఈశాన్య ఉత్తరప్రదేశ్‌లోనూ ఈ జ్వరం బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు.
ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీలో 135 మంది ఈ జ్వరం బారినపడగా, 72 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో 50 మందికిపైగా డెంగ్యూ లక్షణాలున్నాయని తెలిపారు. చిన్నారులు జ్వరాల బారిన మంచం పట్టడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన నాలుగేళ్ల కూతురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్చినట్లు వినోద్ కుమార్ అనే వ్యక్తి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. తీవ్రమైన జ్వరం, ప్లేట్‌లెట్లు పడిపోవడంతో గత శనివారం తన కూతురు మరణించిందని వినోద్ కుమార్ కన్నీటిపర్యంతమయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ జ్వరం తీవ్రంగా ప్రబలుతోంది. దీంతో అనేక మంది బాధితులు ఆగ్రాతోపాటు తదితర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య బృందాలే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్యం అందిస్తున్నాయి. అయితే, అపరిశుభ్రమైన నీరు, పరిసరాల కారణంగానే ఈ వ్యాధి ప్రబలుతోందని ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీషా అసిజా వ్యాఖ్యానించారు. కాగా,
ఫిరోజాబాద్ జిల్లా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ నీతా కులశ్రేష్ట మాట్లాడుతూ.. గత 24 గంటల్లో తీవ్రమైన జ్వరంతో 12 మంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. అయితే, ఈ తీవ్రమైన జ్వరాలకు సంబంధించిన అసలు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. దీనిపై అధ్యయనం తర్వాతే అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు.
ఈ క్రమంలో జ్వరంతో బాధపడుతున్నవారికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించినప్పటికీ వీరిలో ఎవరికీ వైరస్ ఉందని తేలలేదని చెప్పారు మరో వైద్యుడు హన్సరాజ్ సింగ్. రోగులు ఎక్కువగా వస్తుండటంతో ఆస్పత్రిలో పడకలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వార్డులు ఖాళీగా ఉండటంతో జ్వరం బాధితులను అక్కడే ఉంచి చికిత్స చేస్తున్నామని చెప్పారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుండటంతో పిల్లలు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఈ జ్వరం తీవ్రత మరింతగా ఉంటోందని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications