రాజస్థాన్ ఎన్నికల్లో ఇంటినుంచే ఓటు వేసిన 12వేల మంది ఓటర్లు...
ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు (Home voting) ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన విధానం మంచి ఫలితాలు ఇస్తోంది. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగుల కోసం ఈసీ ఈ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగుల కోసం తొలి విడత పోలింగ్‌లో 12వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును ఇంటినుంచే వినియోగించుకున్నారు.
ఇందుకోసం ప్రత్యేక పోలింగ్ బృందాలను ఈసీ నేరుగా వారి ఇళ్లకే పంపి పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికట్లో ఇంటి నుంచే ఓటింగ్ వేసేందుకు రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగా 62,927 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. మంగళవారం తొలివిడత పోలింగ్ ప్రారంభం కాగా, మొత్తం 9,687 మంది వృద్ధులు, 2,655 మంది దివ్యాంగులు ఇంటి నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెండో విడతలోనూ వారికి అవకాశం : అంతేకాదు, తొలి విడత పోలింగ్ సమయంలో ఇంటి వద్ద లేని వారికి రెండోసారి అవకాశం కల్పించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దే ఓటు వేసే సౌకర్యం నవంబర్ 19వ తేదీ వరకూ కొనసాగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే, నవంబర్ 20, 21 తేదీల్లో రెండోసారి పోలింగ్ బృందాలు వారి ఇళ్లకు వెళ్లి, ఓటు హక్కు వినియోగించనివారికి అవకాశం కల్పించనున్నారు. అత్యవసర సర్వీసుల విభాగంలో ఉండే వారు 19 నుంచి 21వ తేదీ వరకూ ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.
ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో జలోర్ జిల్లాలోని భిన్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 102 ఏళ్ల భూరి దేవి ఉన్నారు. ఇంటి నుంచి ఓటింగ్ సధుపాయం కల్పించిన తర్వాత రాష్ట్రంలోనే అధిక వయసు కలిగి, ఈ విధానంలో ఓటు వేసిన మొదటి వ్యక్తిగా ఆమె గుర్తింపుపొందారు. కాగా, 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications