81 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఏమైనట్టు: అంచనాలు తగ్గించిన కేంద్రం: సుప్రీంలో అఫిడవిట్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తిగా తన పరిధిలోకి తీసుకున్న తరువాత.. వినియోగానికి సంబంధించిన అంచనాలు తలకిందులవుతున్నాయి. వాటి విలువ కోట్లాది డోసుల్లో ఉంటోంది. ఈ ఏడాది చివరి అయిదు నెలల కాలంలో దేశంలో అందుబాటులో ఉండాల్సిన వ్యాక్సిన్ డోసుల అంచనాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. 216 కోట్ల డోసుల నుంచి 135కు తగ్గించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి అఫిడవిట‌్‌ను దాఖలు చేసింది.

216 నుంచి 135 కోట్ల డోసులకు కుదింపు..
వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలానికి దేశవ్యాప్తంగా 216 కోట్ల డోసుల మేర వ్యాక్సిన్ అవసరమౌతుందని, వాటిని సిద్ధం చేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం కిందటి నెల 13వ తేదీన సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేసింది. నెల తిరిగే సరికి ఈ సంఖ్యను భారీగా కుదించి చూపించింది కేంద్రం. తాజాగా సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్‌లో ఈ సంఖ్యను 135 కోట్ల డోసులకు తగ్గించింది. ఆగస్టు-డిసెంబర్ మధ్యకాలానికి 135 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా 81 కోట్ల డోసుల వరకు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆగస్టు-డిసెంబర్ మధ్య అయిదు కంపెనీల టీకాలు..
కేంద్రం ఇచ్చిన తాజా అఫిడవిట్ ప్రకారం.. దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అయిదు కంపెనీకు చెందిన టీకాలను వినియోగించాల్సి ఉంటుంది. కోవిషీల్డ్-50, కోవాగ్జిన్-40, బయోలాజికల్ ఇ సబ్ యూనిట్ వ్యాక్సిన్-30, జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్-5, స్పుత్నిక్ వీ-10 కోట్ల డోసుల మేర అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కిందటినెలలో సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్‌తో పోల్చి చూస్తే.. కంపెనీల సంఖ్య కూడా తక్కువే.

పాత అఫిడవిట్‌తో పోల్చుకుంటే..
ఇదివరకు మొత్తంగా ఎనిమిది కంపెనీల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని సుప్రీంకోర్టుకు వివరించింది. కిందటినెల అఫిడవిట్ ప్రకారం.. కోవిషీల్డ్-77, కోవాగ్జిన్-55, బయోలాజికల్ ఇ వ్యాక్స్-30, జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్-5, నొవావ్యాక్స్-20, భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్-10, జెనోవా బయోఫార్మా-6, స్పుత్నిక్ వీ-15.06 కోట్ల డోసులను సిద్ధం చేస్తామని తెలిపింది. అవేవీ కార్యరూపం దాల్చనట్టు కనిపిస్తోంది. అందుకే- 81 కోట్ల డోసుల మేర వ్యాక్సిన్‌ను తగ్గించి చూపించింది.

జులై 31 నాటికి 51.6 కోట్ల డోసులు రెడీ..
దేశ జనాభాలో 93 నుంచి 94 కోట్ల మంది వరకు 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారు ఉన్నారని, ఈ కేటగిరీ కోసం 186 నుంచి 188 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమౌతుందని అంచనా వేసినట్లు తెలిపింది. జులై 31వ తేదీ నాటికి 51.6 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వాటిని దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తోన్నామని స్పష్టం చేసింది. అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఆగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో 135 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను సేకరించాల్సి ఉంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications