ఘోరం: బాలికపై గ్యాంగ్‌రేప్, చెట్టుకు వేలాడదీశారు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆ తర్వాత ఆమెను హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. అంతకుముందు ఆ కామాంధులు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్‌లో ఈ దారుణం జరిగింది. కాగా, ఈ ఘోరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేసు విచారణలో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు నలుగురు కానిస్టేబుల్‌లపై వేటువేశారు.
బాధితురాలు కనిపించడంలేదని గత శుక్రవారం ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అయితే గ్రామం అవతల ఓ చెట్టుకు శనివారం తన కుమార్తె ఉరివేసి కనిపించడంతో ఆయన నిశ్చేష్టులయ్యారు. బాధితురాలే ఉరివేసుకుందని అందరూ భావించడానికే ఆమెను చెట్టుకు వేళాడదీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే నిందితులు ఇమ్రాన్, సర్వ్‌జీత్ యాదవ్, ఘన్‌శ్యామ్ మౌర్యాలే తన కుమార్తెను అపహరించి, దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇంతకుముందు సైతం వీరు తమ కుమార్తెను అపహరించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సర్వ్‌జీత్, ఇమ్రాన్‌లను అరెస్టుచేశారు.
మూడో నిందితుణ్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. కాగా, ఈ దారుణ ఘటనకు సంబంధించి స్థానికులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2014లో బదౌన్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్య చేసిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే చోటుచేసుకోవడంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications