దేశ రాజధానిలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు: ఏడు నెలల్లో అత్యధికం
న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గురువారం 2,726 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు ఏడు నెలల్లో అత్యధికం అని ఆరోగ్య శాఖ డేటా తెలిపింది.
దీంతో పాటు, కరోనా కారణంగా 6 మరణాలు కూడా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది. డేటా ప్రకారం.. క్రియాశీల కేసుల సంఖ్య 8,840కి చేరుకుంది. ఇది ఆరు నెలల్లో అత్యధికం.
అంతకుముందు ఫిబ్రవరి 6న, క్రియాశీల కరోనావైరస్ రోగుల సంఖ్య 8,869గా ఉంది. గత 24 గంటల్లో 18,960 పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్కులు తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలోనూ పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు 16,299 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 19,431 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.53 శాతానికి చేరుకుంది.
యాక్టివ్ కేసులు 0.28 శాతానికి పడిపోయాయి.
మొత్తం కేసులు 4,42,06,996కి చేరుకోగా, క్రియాశీల కేసుల సంఖ్య 1,25,076కు పెరిగింది. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,35,55,041కు చేరింది.
మరోవైపు, దేశంలో బుధవారం 25,75,389 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 207.03 కోట్లు దాటింది. మరో 3,56,153మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.












Click it and Unblock the Notifications