మళ్లీ పేట్రేగిన టెర్రరిస్టులు: బలగాలపై దాడి -2పోలీసులు, 2పౌరుల మృతి -జమ్మూకాశ్మీర్‌లోని సోపోర్‌లో ఘటన
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. భద్రతా బలగాలకు సవాలు విసురుతూ ఇటీవల వరుస దాడులతో బెంబేలెత్తిస్తోన్న ముష్కరులు ఈసారి టర్గెట్ ను దాదాపుగా సాధించారు. ఆర్టికల్ 370 అమలు నేపథ్యంలో ఏడాదిన్నర కిందట విధించిన నిర్బంధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న కాశ్మీర్ లో టెర్రరిస్టులు మళ్లీ అలజడి సృష్టిస్తుండటం కలకలం రేపుతున్నది..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దును ఆనుకుని ఉండే బారాముల్లా జిల్లాలో శనివారం ఉగ్రదాడి జరిగింది. జిల్లాలోని సోపోర్ పట్టణంలో రద్దీగా ఉండే మెయిన్ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసుల సంయుక్త బలగాలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న బద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపారు. కానీ అప్పటికే టెర్రరిస్టులు తప్పించుకుని పారిపోయారు..

టెర్రరిస్టుల తూటాలకు జమ్మూకాశ్మీర్ కు చెందిన ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు సాదారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో పోలీసులుకు, ఇంకో ఇద్దరు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ పౌరులను సాధారణ ఆస్పత్రికి, గాయపడ్డ పోలీసును ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. కాల్పుల తర్వాత మెయిన్ చౌక్ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్న బలగాలు టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పాక్ సరిహద్దులోని కాశ్మీర్ జిల్లాల్లో ఇలా భద్రతా బలగాలపై కాల్పులు జరపడం ఇటీవల పరిపాటిగా మారింది. జమ్మూకాశ్మీర్ నుంచి కేంద్రం తన బలగాలను వెనక్కి రప్పిస్తున్నకొద్దీ, ఉగ్రకలాపాలు మళ్లీ పెరుగుతుండటం గమనార్హం.
ఉగ్రదాడి జరగడాకికి కొద్ది గంటల ముందు ఇదే బారాముల్లా జిల్లాలోని నూర్ బాగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక స్వీపర్స్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి, కాలనీ మొత్తానికీ వ్యాపించాయి. ఘటనలో మొత్తం 20 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకున్నా భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది.












Click it and Unblock the Notifications