
దేశంలో వేగంగా విస్తరిస్తున్నకరోనా ... మే నెలాఖరుకు 2 లక్షల మంది బాధితులు ?
ఇండియాలో లాక్ డౌన్ ౩.o కొనసాగుతున్నప్పటికీ భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది . భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి చాప నీరులా విస్తరిస్తుంది. కరోనా వైరస్ విషయంలో లాక్ డౌన్ విధించి కట్టడి చెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా తయారైంది. మే నెలాఖరుకి మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు పెరిగే ప్రమాదం కనిపిస్తుంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు .
ముంబై సెంట్రల్ జైలులో ఖైదీలు, సిబ్బందితో సహా 103 మందికి కరోనా పాజిటివ్

వేగంగా విస్తరిస్తున్న కరోనా .. ఇప్పటి వరకు 67,259కేసులతో భారత్
భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక దేశంలో ఊహించని విధంగా పెరుగుతున్న కేసులు చూస్తే గడిచిన 24గంటల్లో దేశంలోనే అత్యధికంగా 4,213కరోనా కేసులు నమోదయ్యాయని,మొత్తంగా ఇప్పటివరకు 67,259కేసులు నమోదైనట్లు నేడు కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆదివారం ఒక్కరోజే 97మంది చనిపోయారని, ఇక సోమవారం నాటికి మొత్తంగా2,212 కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది.

గడిచిన 48 గంటల్లో 13శాతం పెరిగిన కరోనా కేసుల సంఖ్య
గడిచిన 48 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 13శాతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్ డౌన్ సడలింపులు చేసి ప్రభుత్వం నిదానంగా జన జీవనం కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక తాజాగా గడిచిన రెండు రోజుల్లో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ముంబై,అహ్మదాబాద్,చెన్నై,థానే,ఇండోర్ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు తెలుస్తుంది . గడిచిన 48గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 39శాతం ఈ ఐదు జిల్లాల్లోనే నమోదైనట్లు తెలుస్తుంది . లాక్ డౌన్ సడలింపులతో దేశంలో ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి.

మే నెలాఖరుకు 2 లక్షల కేసులు ?
ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే 22,171 కరోనా కేసులతో దేశంలో మహారాష్ట్ర నెం.1స్థానంలో నిలవగా, గుజరాత్‌లో 8,194, తమిళనాడు 7,204 , ఢిల్లీ 6,923 కేసులతో ముందు వరుసలో ఉన్నాయి . అయితే,ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే మరో 7రోజుల్లో దేశంలో కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మే నెలాఖరులోగా కేసుల పెరుగుదల 2 లక్షలకు చేరుతుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశపు ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర భారం వెయ్యనుందని తెలిపారు. రికవరీ రేటు మెరుగుపడుతుందని,కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక కోలుకుంటున్న వారి శాతం 31.4శాతంగా ఉన్నట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా, 41,97,174 మందికి వ్యాధి సోకింది. మరియు ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 2, 84,096 గా ఉంది.